
Kanna Lakshminarayana: అవసరం ఏ పనైనా చేయిస్తుందంటారు. ఎంతవరకైనా తీసుకెళుతుందంటారు. ఇక రాజకీయాల్లో ‘అవసరం’ అన్న మాటకు మించింది లేదు. అక్కడ పరస్పర ప్రయోజనలే తప్ప మరో దానికి చోటులేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు డిసైడ్ అవ్వడం వెనుక పరస్పర అవసరం, ప్రయోజనాలు తప్ప మరేదీ కనిపించడం లేదు. చంద్రబాబుతో కన్నా లక్ష్మీనారాయణది దశాబ్దాల వైరం. కన్నా లక్ష్మీనారాయణకు చెక్ చెప్పేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎలాగైనా కన్నాను రాజకీయంగా సమాధి చేయాలని బాబు భావించారు. అయితే అటువంటి చంద్రబాబు పార్టీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోవడం మాత్రం రకరకాల చర్చకు కారణమవుతోంది.
Also Read: Sajjala Bhargav: వైసీపీ సోషల్ మీడియాలో చిచ్చు.. తండ్రి ఫార్ములాను అనుసరిస్తున్న సజ్జల భార్గవ్
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని పెద్దకురాపాడు. అదే నియోజకవర్గం నుంచి 1989,1994, 1999, 2004లో వరుసగా నాలుగు సార్లు కన్నా విజయం సాధించారు. ఇందులో 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో, బయటా చంద్రబాబుపై కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎంగా చంద్రబాబు నిర్ణయాలను సైతం తప్పుపట్టేవారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. పెద్దకురాపాడు నియోజకవర్గంలో కన్నాకు చెక్ చెప్పేందుకే ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ప్రయత్నలేవీ ఫలించలేదు.
1991లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి మంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖను నిర్వర్తించిన కన్నా లక్ష్మీనారాయణ భారీగా అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. గవర్నర్ కు సైతం ఫిర్యాదుచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ ను వీడిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా బీజేపీ వైపు అడుగులు వేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అయితే నాడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావడానికి కన్నాయే కారణమన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినిపించాయి. చంద్రబాబుతో ఉన్న వైరంతో కన్నా హైకమాండ్ పెద్దలకు చెప్పి గ్యాప్ పెంచారని.. దాని ఫలితమే బీజేపీకి టీడీపీ దూరం కావడమన్న వార్తలు వచ్చాయి.

ఎన్టీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. దారుణంగా వంచించిందని ఆరోపిస్తూ చంద్రబాబు యూపీఏ వైపు మొగ్గుచూపారు. దీంతో టీడీపీ, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీతో పాటు చంద్రబాబుపై వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు. తనను హత్య చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ లో ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. సోము వీర్రాజు చేతిలోకి పార్టీ వెళ్లిపోయింది. అటు జనసేన సైతం కన్నా విషయంలో ఆశించిన ఆసక్తి చూపలేదు. చంద్రబాబు ఆఫర్ నచ్చడంతో పాతవిషయాలు అన్నీ మరిచి కన్నా చంద్రబాబుకు స్నేహ హస్తం అందిస్తున్నారు. అందుకే రాజకీయాల్లో అవసరాలు, పరస్పర ప్రయోజనాలకు తప్ప మరి దేనికీ చోటు ఉండదు.