Homeజాతీయ వార్తలుKalvakuntla Kavitha : కవిత అరెస్ట్ తో బీజేపీకి లాభమా? నష్టమా?

Kalvakuntla Kavitha : కవిత అరెస్ట్ తో బీజేపీకి లాభమా? నష్టమా?

Kalvakuntla Kavitha : మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కీలక అడుగు వేసింది. ఈ స్కామ్ లో కీలక నిందితురాలని భావిస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఫ్లైట్ బుక్ చేశారు. కవితను అందులో ఢిల్లీకి తరలించి, తమ కస్టడిలోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం నమోదయింది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురిని ఈడీ అరెస్టు చేయడం కలకలం రేపింది. వాస్తవానికి కవిత అరెస్టు ఎప్పుడో జరగాల్సి ఉండగా.. ఇన్నాళ్లపాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కాలయాపన చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకానొక దశలో బిజెపికి కెసిఆర్ మోకరిల్లారని.. అందువల్లే కవితను అరెస్టు చేయకుండా ఈడి నిశ్శబ్దంగా ఉంటుందని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె అరెస్టు ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే అప్పుడు కూడా ఈడి సైలెంట్ గానే ఉంది. కానీ అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కవితను అరెస్టు చేస్తే రాజకీయంగా బిజెపికి లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? అనే చర్చలు తెరపై వస్తున్నాయి.. వాస్తవానికి కవితను ముందే అరెస్టు చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత మైలేజ్ వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరెస్టు ద్వారా భారత రాష్ట్ర సమితికి మధ్య ఎటువంటి లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పినట్టయ్యేదని వివరిస్తున్నారు. కానీ అలాంటి చర్యలకు పాల్పడకపోవడంతో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తినాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు.. పైగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బిజెపికి, భారత రాష్ట్ర సమితికి మధ్య ఒక అంగీకారం ఉందని, అందువల్లే కవితను అరెస్టు చేయడం లేదని ఆరోపించింది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఆరు గ్యారెంటీలకు తోడు ప్రజలు ఆ మాటలను నమ్మడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే బిజెపి, భారత రాష్ట్ర సమితి అడుగులు ఉండటంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కమలనాథులకు ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తినడం, భారత రాష్ట్ర సమితి కూడా ఓడిపోవడం.. వాటి పరిణామాలతో ఒక్కసారిగా బీజేపీ పెద్దల్లో అంతర్మథనం ఏర్పడింది. ఎలాగైనా తెలంగాణలో చక్రం తిప్పాలని, దానికి బలమైన పునాదులు వేసుకోవాలని భావించారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ డీ కవితను అరెస్టు చేసింది.

కవిత అరెస్టయిన నేపథ్యంలో.. బిజెపి తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కవిత అరెస్టు ద్వారా భారత రాష్ట్ర సమితి స్థానాన్ని ఆక్రమించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో పది నుంచి 12 స్థానాలు గెలుచుకోవాలని.. ఎందుకంటే గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి 9 స్థానాల్లో విజయం సాధించింది. అయితే దాని స్థానంలో పాగా వేయడం ద్వారా బలాన్ని పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో.. ఆ ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించకుండా చేయాలనేది బిజెపి పెద్దల ప్లాన్. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. అవినీతి చేసిన వారికి ప్రజా జీవితంలో తావు లేదని సంకేతాలు ఇచ్చారు. ప్రధాని వచ్చిన కొద్ది రోజులకే కవిత అరెస్టు చోటు చేసుకోవడం విశేషం. అయితే కవిత అరెస్టు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు లాభిస్తుందో.. అంతవరకు నష్టం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత అరెస్టును సింపతిగా భారత రాష్ట్ర సమితి వాడుకుంటుందని.. అప్పుడు అది ఆ పార్టీకి లాభం చేకూర్చుతుందని వారు అంటున్నారు. మరి దీనిని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version