2020.. అటు మనుషుల ప్రాణాలతోనే కాదు.. ఇటు చిత్రపరిశ్రమనూ ఓ ‘ఆట’ ఆడేసుకుంది. కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని ఏ స్థాయిలో దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. దేశంలో ఫస్ట్ కరోనా కేసు ఎప్పుడైతే నమోదై.. రాష్ట్రం వరకు చేరిందో అప్పటి నుంచే సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యాయి. పది నెలలకు పైగా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఇటు ప్రేక్షకులూ వినోదాన్ని కోల్పోయారు. అభిమాన హీరోల సినిమాలూ మిస్ అయ్యారు.
ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఇటీవలే థియేటర్లు సైతం తెరుచుకున్నాయి. హీరోలు, దర్శకులు, సినీ ఆర్టిస్టులందరూ షూటింగ్‌ల బిజీలో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
ఈ ఏడాది తెలుగు సినీ ప్రియులు కావాల్సినంత వినోదాన్ని ఆస్వాదించబోతున్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి సినీ పరిశ్రమ కోలుకొని కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించేశారు. తాజాగా చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ వంటి అగ్రతారలు తమ తాజా చిత్రాల ఆగమనం గురించిన వివరాలను వెల్లడించారు. వరుస సినిమాల విడుదలతో రాబోవు రోజుల్లో థియేటర్లు కళకళలాడబోతున్నాయి.
ప్రేక్షకుల ఎదురుచూపుల మేరకు.. ప్రొడ్యూసర్లు ఒక్కో స్టార్ హీరో తీస్తున్న సినిమా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఒకటి రెండు కాదు.. మూడు రోజుల్లోనే ఏకంగా 9 భారీ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అందుకే మహేష్ బాబు, చిరంజీవి సహా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుల సినిమాలు కూడా ఉన్నాయి. మరి మూడు రోజుల్లోనే రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలేంటో చూద్దాం..
*మెగాస్టార్@ఆచార్య
‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కథనాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకాలపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ ఆగర్వాల్ కథానాయిక. మే 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు.. శుక్రవారం టీజర్‌ను సైతం రిలీజ్ చేశారు. రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. ధర్మస్థలి ప్రాంతంలో దుష్టశిక్షణకు పూనుకున్న ఆచార్యుడి రొమాంచిత పోరాటఘట్టాలతో టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో చిరంజీవి దేవాలయాలపై జరిగే అన్యాయాలు, దేవుని మాన్యాల అన్యాక్రాంతంపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మణిశర్మ పాటలు అందిస్తున్నారు.
*పవర్‌స్టార్@ వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ కూడా ఇదే సినిమాతో ఇవ్వనున్నాడు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి, నివేధా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్‌సాబ్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అఫిషీయల్‌గా ప్రకటించేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ అప్టేట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. కాగా.. ఈ సినిమా తర్వాత పవన్ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
*సంక్రాంతి బరిలో సర్కార్ వారి పాట
మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల దుబాయిలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు, బిజినిమెన్, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతి నేపథ్యంలో విడుదలై మంచి విజయాలు సాధించాయి. అదే కోవలో ‘సర్కార్ వారి పాట’ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అని నిర్మాణ సంస్థలు చెప్పాయి. బ్యాంకు రుణాల నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల మోసాలు, రైతు శ్రమ దోపిడీ వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన–దర్శకత్వం పరశురామ్ పెట్ల.
*అక్టోబర్ 13న ఆర్‌ఆర్‌ఆర్
‘బాహుబలి’ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జనవరి 8న విడుదల చేయాల్సి ఉంది. కిందటేడాది ఈ తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఎనిమిది నెలలపాటు షూటింగ్‌లు నిలిచిపోవడంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తికాలేదు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. కొత్త విడుదల తేదీని రాజమౌళి ఎప్పుడు ప్రకటిస్తారా..? అని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
*నారప్ప@విక్టరీ
‘భార్యాపిల్లలే లోకంగా బతికే నారప్ప వారి ప్రాణాలను కాపాడడం కోసం ఎలాంటి పోరాటం సాగించాడో తెరపై చూడాల్సిందే’ అంటున్నాడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలక పాత్రధారి. మే 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వెంకటేష్ పాత్రచిత్రణ భిన్న పార్శ్వాలతో ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
*జూలై 2న ‘మేజర్’
26/11 ముంబయి ఉగ్రదాడుల్లో దేశం కోసం వీరమరణం పొందిన సైనికాధికారి సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. అడవి శేషు టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూలై 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సందీప్ ఉన్నికృష్ణన్ సాహసోపేతమైన పోరాటం, విలువలతో కూడిన జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్ఫూర్తివంతంగా ఉంటుంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది.
*జూలై 16న ‘కేజీఎఫ్–2’
యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్–2’. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి కథానాయిక. సంజయ్‌దత్, రవీనాటాండన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. జూలై 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్–1కు కొనసాగింపుగా భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రమిది. కోలార్ గోల్డ్‌ఫీల్డ్‌పై ఆధిపత్యం కోసం రాఖీభాయ్ సాగించిన సమరంతో రొమాంచితంగా ఉంటుంది. యష్, సంజయ్‌దత్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. కన్నడం, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నామని’ చెప్పారు.
-శ్రీనివాస్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Josh with the announcement of the dates of tollywood heroes movies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com