
కొవిడ్-19 ఎక్కడ పుట్టింది అన్న ప్రశ్నకు ప్రపంచంలో ఏ మూలనైనా సమాధానం దొరుకుతుంది. కానీ.. ఎలా పుట్టింది అన్న ప్రశ్నకు మాత్రం ఖచ్చితమైన సమాధానం లేదు. చైనాలోని చేపల మార్కెట్లో సహజంగా ఉద్భవించిందా? వుహాన్ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ బయటకువచ్చిందా? చైనా వాంటెడ్ గా బయటకు వదిలిందా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటిపై ఎవరి అనుమానాలు వారికున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. కానీ.. ఇందులో ఏది వాస్తవం అన్నది మాత్రం ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ అప్పట్లో.. చైనానే ఈ వైరస్ సృష్టించిందని ఆరోపించారు. ప్రపంచంలోని చాలా మంది కూడా ఎందుకంటే.. ఇదే మాట అన్నారు. కానీ.. గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. సరైన ఆధారాలు లేవు గనక. ఆధారం లేనంత వరకూ ఏదీ సత్యం కాబోదు. అందుకే.. ఈ నిజాన్ని తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బృందాన్ని చైనాకు పంపింది. తొలిదశ దర్యాప్తు కూడా పూర్తయింది. అయితే.. వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చిందని సరైన ఆధారాలు లేవని చెప్పుకొచ్చింది. అయితే.. చైనా ఈ వైరస్ ను తయారు చేయలేదని కరాఖండిగా చెప్పలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. కరోనా వైరస్ జన్మ రహస్యాన్ని మూడు నెలల్లోగా తేల్చాని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏడాదిన్నర కాలంగా.. అమెరికాలోని దర్యాప్తు సంస్థలు రెండుగా విడిపోయాయని చెప్పిన బైడెన్.. నిజం తేల్చాలంటూ తమ దేశానికి చెందిన నిఘా వర్గాలను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వైరస్ జంతువుల నుంచి సహజంగానే మనుషులకు సంక్రమించిందా? లేదా.. ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందా అన్న వివరాలపై సమగ్ర నివేదిక కోరారట. మరి, 90 రోజుల్లో అమెరికా సంస్థలు ఏం తేలుస్తాయి? ఎలాంటి విషయాలను బయట పెడతాయన్నది చూడాల్సి ఉంది.