TTD New Chairman: తిమింగళాలు ఆకలిని తీర్చుకునేందుకు తనకు ఎదురొచ్చిన చేపలను మింగేస్తుంటాయి. అటవిక రాజ్యంలో సింహం తన తోటి జంతువులను వేటాడి తినేస్తుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కూడా సేమ్ సీన్. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలపరుచుకోవడానికి ఎంతటి పనినైనా చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. ప్రజలను నయానో..భయానో తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వలంటీర్లతో 50 కుటుంబాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుండగా.. ఇప్పుడు వారిపై గృహసారథులను నియమిస్తున్నారు. గత ఎన్నికల్లో పనికొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని సలహాదారులతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను ఆలస్యం చేసి.. వీరికి మాత్రం ఠంచనుగా ఒకటో తేదీన జీతాలు, ఇతర అలవెన్స్ లు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఎన్నికలకు సమీపిస్తున్న కొలదీ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కీలక పదవులు అస్మదీయులకు కట్టబెట్టిన జగన్.. ఇప్పుడు ఉన్న ఈ కొద్ది నెలలు బడుగు బలహీనవర్గాలకు ఇచ్చేందుకు నిర్ణయించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పాపం సినీ నటుడు మోహన్ బాబు ఈ పదవిపై మోజు పెంచుకొని గత ఎన్నికల ముందు నానా యాగి చేశారు. పదవి కోసం ఎంతగానో పరితపించారు. తన మనసులో ఉన్న మాటను కూడా చాలా సందర్భాల్లో బయటపెట్టారు. కానీ వాటికి జగన్ మనసు కరగలేదు. తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే పదవి కేటాయించారు. చాలా సార్లు ఆయనకు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కొద్దినెలల పాటు తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకూ బీసీలకు అప్పగించి.. అధికారంలోకి వస్తే మళ్లీ బాబాయ్ కే పీఠం అందించేందుకు తాజాగా నిర్ణయించారు.

బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి టీటీడీ అధ్యక్ష పీఠం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు కీలకంగా మారడంతో వైవీ సేవలను పార్టీకే వినియోగించుకోవాలని జగన్ పిక్స్ అయినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టుతో వైవీ పదవీ కాలం ముగుస్తుంది. అదే నెల వైకుంఠద్వార దర్శనం అనంతరం వైవీ పదవి నుంచి నిష్క్రిమిస్తారని టాక్ ఉంది. అటు జంగా కృష్ణమూర్తి వైసీపీలో సీనియర్ నాయకుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. గురజాల రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో జంగాను టీటీడీ పీఠంపై కూర్చోబెట్టాని జగన్ డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇదే పంథాను అనుసరించారు. ఎన్నికలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్ కి టీటీడీ బాధ్యతలు కట్టబెట్టారు. బీసీ నినాదాన్ని తెచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈసారి జగన్ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో?