Mylavaram Constituency- Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. పొత్తుల కోసం పార్టీలు ముందుకు వస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఏర్పడిందని గుర్తిస్తున్నాయి. దీని కోసం వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈనేపథ్యంలో రాష్ర్టంలోని మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా కనిపిస్తోంది.

దీంతో పార్టీల్లో పొత్తుపై కూడా సానుకూల సంకేతాలు ఇస్తోంది.
మైలవరం నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది. దీనిపై టీడీపీకి కూడా కన్ను ఉంది. కానీ పొత్తులో భాగంగా జనసేనకే కేటాయిస్తారనే వాదన వస్తోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గంపై జనసేన పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కల్యాణ్ బలమైన నేతను ఇన్ చార్జిగా నియమించడంతో ఇక్కడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయని చెబుతున్నారు. నేతల మధ్య భేటీలు కూడా జరుగుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు నేతల అభిప్రాయం. మరోవైపు మైలవరం టీడీపీ నేత దేవినేని ఉమపై సొంత పార్టీలోనే ఎందరో ప్రయత్నిస్తున్నారు. దీంతో వారికి జనసేన పార్టీ అండగా దొరికినట్లు అయింది.

దేవినేని ఉమను పక్కన పెట్టి జనసేన పార్టీకి టికెట్ కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది.
మైలవరం ప్రజలు స్థానికుడినే నాయకుడిగా చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో వారికి జనసేన మరో ఆయుధంగా దొరికినట్లు అయింది. టీడీపీతో పొత్తు ఉంటే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థినే రంగంలోకి దింపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. సీట్ల సర్దుబాట్లలో భాగంగా జనసేన పార్టీ దీనిపై పేచీ పెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పార్టీకి మంచి ప్రయోజనాలు దక్కనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికలు పార్టీల్లో మరింత మార్పులు వచ్చేలా చేస్తాయనడంలో సందేహం లేదు.