
ఏపీలో సీఎం జగన్ కు తెలియకుండా పాలన నడుస్తోంది. అసలు ముఖ్యమంత్రికి తెలియకుండానే ఓ జీవో విడుదలైందా? జనసేన చేసిన తాజా ఆరోపణ సంచలనమైంది. జగన్ కు తెలియకుండా ఓ మంత్రి జీవో తెచ్చారని.. మరో మంత్రి వెల్లంపల్లి అనుయాయులకు రూ.30 కోట్ల రాయితీలు ఇచ్చారని జనసేన చేసిన ఆరోపణ తాజాగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఏపీ సీఎం జగన్ కేబినెట్ లోని కీలక మంత్రులపై తాజాగా ఈ ఆరోపణలు వచ్చాయి. జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఈ ఆరోపణలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ స్కామ్ కు తెరలేపారని ఆయన ఆరోపించారు. అందులోని నలుగురు పార్ట్ నర్లు వెల్లంపల్లి పక్కనే ఉంటారని ఆయన తెలిపారు.
జీవో 61 ద్వారా వెల్లంపల్లి మిత్ర బృందానికి 30 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారని జనసేన అధికార ప్రతినిధి మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీయల్ కారిడార్ లోని లేని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం ఈ జీవో తెచ్చారని.. సీఎందృష్టిలో లేకుండా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జీవో తెచ్చారని మహేష్ ఆరోపించారు. ఇద్దరు మంత్రులు కలిసి కమిషన్ పంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని మహేష్ తెలిపారు. విజయవాడ వస్త్రలత కాంప్లెక్స్ ను ఖాళీ చేయాలని ఒత్తిడి చేయించి బిజినెస్ పార్క్ కు తరలించాలని వెల్లంపల్లి చూస్తున్నారని జనసేన ప్రతినిధి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఈ ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
జీవో 61తో కానీ.. జీవోతో లబ్ధి పొందిన వ్యక్తులతో సంబంధం లేదని మంత్రి దుర్గమ్మపై ప్రమాణం చేయాలని చాలెంజ్ విసిరారు. తాము కూడా విజయవాడ దుర్గ గుడికి వస్తామన్నారు.
మొత్తంగా చూస్తే ఇప్పుడు సీఎం జగన్ కు తెలియకుండా ఓ మంత్రి ఇలా జీవో తెచ్చాడా? అన్న వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై మంత్రి వెల్లంపల్లి కానీ.. ఇతర ప్రభుత్వ అధినేతలు కానీ ఇప్పటివరకు స్పందించలేదు.