Janasena: ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీది డిఫరెంట్ రోల్.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే అయోమయంగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉన్నట్లా..? లేనట్లా..? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామంటూనే.. బీజేపీకి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి పవన్ ప్రణాళిక వేస్తున్నారు. తాజాగా ఆయన విశాక స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలో ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకే ఆయన విశాఖ వెళ్లనున్నాడు. ఈ తరుణంలో బీజేపీ నాయకులు డైలామాలో పడ్డారు.

గత ఎన్నికల తరువాత జనసేన పార్టీ అధినేత బీజేపీతో దగ్గరగ ఉంటూ వస్తున్నారు. ఇరు పార్టీనేతలు కలిసి వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనూ బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత నుంచి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ తీసుకునే కొన్ని నిర్ణయాలు జనసేన అధినేతకు నచ్చడం లేదట. అంతేకాకుండా కిందిస్థాయి కేడర్లో బీజేపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఉంది. విజయవాడ లాంటి ప్రాంతాల నేతలు బీజేపీతో పొత్తు వద్దని పవన్ కు విన్నవించారు.
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికలో తాము బరిలో ఉండమని సంచలన ప్రకటన చేశారు. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని పోటీలో ఉంచింది. తమ అభ్యర్థికి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తాని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించినా పవన్ మాత్రం ప్రచారం చేయలేదు. దీంతో పార్టీకి దూరమైనట్లేనని అనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వివిధ ఆందోళన కార్యక్రమాలను జనసేన ఒంటరిగానే చేస్తోంది.
తాజాగా పవన్ విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి ఉలుకు, పలుకు చేయలేదు. బీజేపీ సీనియర్ నాయకులు మాత్రం ప్రైవేటీకరణ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే కొన్నిరోజులుగా ఉవ్వెత్తిన ఎగిసిన ఈ ఉద్యమం ఆ తరువాత చల్లబరిచినట్లయింది. ప్లాంట్ ఉద్యోగులు సైతం కామ్ కావడంతో రాజకీయ నాయకులు తమకెందుకులే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పుడు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్నారు.
ఎవరెన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రైవేటీకర్ పనులు ఇప్పటికే సగం పూర్తి చేసింది. మిగతా పార్టీలు సైతం ఇక ఇప్పుడు ఆందోళన చేసినా లాభం లేదని మిన్నకుండిపోయాయి. కానీ జనసేన అధినేత మాత్రం ఇప్పుడు ఆందోళన చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే గతంలో పవన్ విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పినా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనలేదు. కానీ ఈ సమయంలో ఉద్యమిస్తామంటూ పవన్ వెళ్తుండడంపై ఆసక్తిగా చర్చ సాగుతోంది.