Jagan Assets Case: పుష్కరకాలం కిందట గాలి జనార్థనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులకు ఎట్టకేలకు చలనం వచ్చింది. రోజువారీగా కేసుల విచారణ చేసి ఆరు నెలల్లో పూర్తిచేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో నవంబరు 9 నుంచి విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. మరోవైపు అంతగా వెలుగులోకి రాని ఓకేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న సివియల్ కేసులు… ముఖ్యంగా నాలుగేళ్ల పాటు విచారణకు రాని కేసుల వివరాలను అందించాలని అన్ని హైకోర్టులకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలు ఇవ్వడానికి గాలి జనార్థనరెడ్డి కేసే నేపథ్యంగా నిలవడం విశేషం. కేసులు నమోదై దాదాపు 12 సంవత్సరాలు గడుస్తోంది. కానీ విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. రకరకాల పిటీషన్లు వేసి కేసు జాప్యం చేస్తూ వస్తున్నారు. దీంతో న్యాయవ్యవస్థపై ఒక రకమైన అప నమ్మకం ఏర్పడింది. పలుకుబడి కలిగిన వ్యక్తుల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసులను ఒక కొలిక్కి తెచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నడుంబిగించింది. గతంలో సీజేఐ ఎన్వీ రమణ ఏడాదిలోగా కేసుల విచారణ పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. కానీ ఎందుకో సాధ్యపడలేదు. ఇప్పుడు నాలుగేళ్లుగా విచారణ కానీ కేసులపై సీరియస్ గా దృష్టిపెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ. దేశంలో సివియల్ కేసుల విషయంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. వారి పలుకుబడి, చట్టంలో ఉన్న లొసుగులు, లూప్ హోల్స్ తో చాలామందిపై కేసులు నమోదైనా విచారణలో మాత్రం ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూ వస్తోంది. అటువంటి జాబితాలో ముందుండేది మాత్రం ఏపీ సీఎం జగన్.

అక్రమాస్తుల కేసులో జగన్ పై నమోదైన కేసులు చాలా సీరియస్. దేశంలో అందరి నేతల కంటే జగన్ పై నమోదైన కేసులు తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించినవి. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు సీరియస్ గా అమలైతే మాత్రం విచారణ జాబితాలోకి ముందుగా వచ్చేవి జగన్ కేసులే. పుష్కర కాలం కిందట జగన్ పై కేసులు నమోదయ్యాయి. 16 నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే తరువాత విచారణ మాత్రం మందగించింది. పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలవుతూ వచ్చాయి. అటు బెయిల్ పిటీషన్లు.. ఇటు విచారణ వాయిదా పిటీషన్లు దాఖలవుతునే ఉన్నాయి.కోర్టు హాజరు నుంచి నిందితులు మినహాయింపు కోరుతూ వస్తున్నారు. న్యాయస్థానం ముందుకు వచ్చేందుకు సైతం ఇష్టపడడం లేదు. అయితే ఈ కేసుల విషయంలో సుప్రీం కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశమైతే కనిపిస్తోంది. హైకోర్టుల నుంచి వివరాలు వచ్చిన తరువాత సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశముందని న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.