YS Sharmila – YS Jagan : వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర క్యాబినెట్ మంత్రులు సైతం తరలివచ్చారు. దీంతో గండిపేట లోని గోల్కొండ రిసార్ట్స్ కళకళలాడింది. ప్రధానంగా జగన్ పైనే అందరి ఫోకస్ నడిచింది. అటు సోషల్ మీడియాలో సైతం జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిశ్చితార్థ వేడుకలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను షర్మిల వేడుకలకు ఆహ్వానించారు. తన సోదరుడు జగన్ కు సైతం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందించారు. గత కొద్దిరోజులుగా సోదరుడితో షర్మిలకు విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఈ వేడుకలకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి వచ్చారు. ఆయన వెంట వైసిపి నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జగన్ అంతగా సంతృప్తిగా కనిపించడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆయన భార్య భారతీ మాత్రం చాలా ఉల్లాసంగా గడిపినట్లు కనిపించారు.
కొత్తకాలంగా సీఎం జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఒకప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని షర్మిల ద్వేషించారు. తన సోదరుడు జగన్ కు తీరని అన్యాయం చేసిన పార్టీగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీరి మధ్య వచ్చిన విభేదాలతో ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఏపీ బాధ్యతలు తీసుకోవడం ద్వారా సోదరుడు జగన్ తో తలపడనున్నారు. సహజంగానే ఇది వైసిపి శ్రేణులకు మింగుడు పడని విషయం. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకలకు హాజరు కావడం విశేషం. ఇక్కడ కూడా సోదరి షర్మిల తో జగన్ పెద్దగా దగ్గర కాలేదు. కానీ కుటుంబ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. విజయమ్మ, షర్మిలతో ఆప్యాయ ఆలింగనాల ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.