
గడిచిన వారం రోజుల నుంచి తిరుమల డిక్లరేషన్ గురించి జరుగుతున్న చర్చ అంతాఇంతా కాదు. గతేడాది జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో కనీసం ఈ ఏడాదైనా డిక్లరేషన్ ఇస్తాడా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు నిన్న చిత్తూరు టీడీపీ నేతలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమల ఆలయంలోకి ప్రవేశించేలా చూడాలని సూచించారు.
అయితే జగన్ మాత్రం మరోమారు మొండిగా వ్యవహరించి టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాలు పట్టుబట్టినా వినకుండా శ్రీవారి ఆలయంలోకి జగన్ ప్రవేశించారు. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. నుదుట నామాలు పెట్టుకుని సంప్రదాయ వస్త్రధారణలో తిరుమలకు హాజరైన జగన్ పర్యటన విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక వివాదాల నడుమ సీఎం పర్యటన జరుగుతోంది.
సీఎం జగన్ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్ అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని విమానప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాత్రి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు.
సీఎం యడ్యూరప్పతో కలిసి రేపు ఉదయం సీఎం జగన్ శ్రీవారిని దర్శించనున్నారు. ఆ తర్వాత అమరావతికి పయనమవుతున్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడల్సి ఉంది.