
జగన్ అధికారం చేపట్టాక రాజకీయంగా చాలా వరకు పరిణతి సాధించారు. ఆయన వ్యూహాలు ఆయనవే.. ఆయన లక్ష్యాలు ఆయనవే అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలను సైతం ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసుకున్నారు. వాటికి తగినట్లుగా కౌంటర్ ఇస్తూ.. అలా అని ఎక్కడా బహిరంగంగా విమర్శలు చేయకున్నా.. సైలెంట్‌గా తన పని తను కానిచ్చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీని క్లోజ్ చేసిన జగన్ చూపు ఇప్పుడు బీజేపీపై పడింది. రాష్ట్రంలో బీజేపీ జీరో చేసే విధంగా జగన్ పావులు కదుపుతున్నారు.
అంతేకాదు.. ఎప్పటికైనా బీజేపీకే తన అవసరం ఉంటుందనే సంకేతాలను కేంద్రానికి పంపుతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జగన్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీని ఇరుకునపెట్టాలన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలను ఇందుకు తమకు అనుకూలంగా జగన్ మలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
కొంతకాలంగా పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీని ఇరుకునపెట్టేందుకే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. అదే విధంగా తన ఎంపీలతో పార్లమెంటు, రాజ్యసభల్లో స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నలు వేయిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. విజయసాయరెడ్డి నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని సభ సాక్షిగా జగన్ వారితో చెప్పించారు.
మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం మద్దతిస్తుండటం విశేషం. ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు సార్లు రాష్ట్ర బంద్ చేపట్టారు. ఈ రెండు సార్లు జగన్ ప్రభుత్వం బంద్‌కు మద్దతిచ్చి తాము కేంద్ర ప్రభుత్వం వైపు లేమని స్పష్టంగా చెప్పింది. ప్లాంటును నడిపించడంతోపాటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఇలా ఈ రెండు డిమాండ్లతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం నడుస్తున్నట్లు అర్థమవుతోంది. అలా బీజేపీని జీరో చేసి తన వద్దకే కేంద్ర నాయకత్వాన్ని రప్పించుకునేలా జగన్ భారీ స్కెచ్ వేశారని నిపుణులు అంటున్నారు. మరి జగన్ వేసిన ఈ ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.