
చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇండస్ట్రీల్లో అప్పుడు జరిగిన చర్చ ఏమంటే.. ‘చిరంజీవి తర్వాత ఎవరు?’ అని. అంతేతప్ప.. చిరంజీవిని మించిన వారు ఎవరు అన్న చర్చే జరగలేదు. ఇప్పుడు రీ-ఎంట్రీ తర్వాత కూడా నాగార్జున వంటివారు ‘చిరు రూలింగ్ మళ్లీ మొదలైంది’ అని చెప్పడం జస్ట్ లైక్ చేసిన కామెంట్ కాదు. టాలీవుడ్లో మెగాస్టార్ రేంజ్ కు అది నిదర్శనం. ఆయన స్థాయిని, స్టామినాను కొలవడానికి ఎన్నో విషయాలు కనిపిస్తాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. అంతేకాదు.. నవరసాలు ఆయన పలికించే తీరు చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుందంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన ఫైటింగ్, డైలాగ్ డెలివరీతో సత్తా చాటే మెగాస్టార్.. కామెడీ, డ్యాన్స్ విషయానికి వస్తే.. ఎవరెస్టు మీద ఉంటారు. ఇవి రెండు ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడతాయి.
మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ ఆచార్య. ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ అనే పాటను ఇటీవలే రిలీజ్ చేసింది యూనిట్. 12 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో రన్ అవుతోంది. దీనికి మణిశర్మ మ్యూజిక్ ఒక కారణమైతే.. మెగాస్టార్ డ్యాన్స్ మరో కారణం.
అరవై ఐదు సంవత్సరాల్లోనూ చిరు వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఆయనలోని గ్రేస్ కు మంత్ర ముగ్ధులవుతున్న ఫ్యాన్స్.. ఇది కేవలం మెగాస్టార్ కు మాత్రమే సొంతమని కామెంట్స్ చేస్తున్నారు.
ఆచార్య మే 13న థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రిలీజ్ వాయిదా పడుతుందనే చర్చ కూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి. రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.