Chandrababu Arrest: రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు సీఎం పదవిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన ఏపీలో శాశ్వతంగా నివాసం ఉండడం తక్కువే.టిడిపి ప్రభుత్వ హయాంలో సైతం ఆయన కుటుంబ సమేతంగా నివాసం ఉండేవారు కాదు. లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటూ.. విజయవాడ, హైదరాబాదుల మధ్య రాకపోకలు సాగిస్తుండేవారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తాత్కాలిక నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ ను క్విడ్ ప్రో కింద పొందినట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధ నిర్మాణమని పేర్కొన్న సంగతి విధితమే. లింగమనేని గెస్ట్ హౌస్ పై కేసులో నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఏపీలో నివాసం ఉండడం చాలా తక్కువ. హైదరాబాదు నుంచి పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. అందుకే వైసిపి నేతలు చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. కనీసం ఏపీలో కూడా లేకుండా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ వచ్చారు.
తాజాగా చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్, బాలకృష్ణ, ఈనాడు అధినేత రామోజీరావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ.. ఇలా అందరూ నాన్ లోకల్ అని.. వారికి ఏపీ పట్ల బాధ్యత లేదని.. ఇక్కడ సంపదను కొల్లగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ తరుణంలో జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.
స్కిల్స్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ అయి 32 రోజులు అవుతోంది. గతంలో నెలలో విధిగా రెండు, మూడు సార్లు హైదరాబాద్ వెళ్లేవారు. కానీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత 32 రోజులపాటు ఏపీలో ఉండడం ఇదే తొలిసారి. దీనిపైనే ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఇప్పటివరకు నెలరోజుల పాటు ఏపీలో గడవని చంద్రబాబు ఫస్ట్ టైం 32 రోజులపాటు రాజమండ్రిలో గడిపారని ఎద్దేవా చేశారు. అటు జైల్లో ఉన్నారని ఎగతాళి చేయడంతో పాటు ఏపీలో స్థానికంగా ఉండని విషయాన్ని జగన్ ప్రస్తావించడం విశేషం. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబును ఏపీలో ఉంచిన ఘనత జగన్ కే దక్కుతుందని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.