ఓసీలకు వయోపరిమితి పెంచాలని గతంలో కుడా ఎన్నో ఉద్యమాలు కొనసాగినా ప్రభుత్వంలో చలనం మాత్రం రావడం లేదు. దీంతో రెండు వర్గాలకు మాత్రమే సడలింపు ఇవ్వడంతో ప్రభుత్వానికి వారిపై ఉన్న ప్రేమ మిగతా వారిపై ఎందుకు ఉండట్లేదని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ అనేదే ఉండదని తెలుస్తున్నా మిగతా మూడు వర్గాలకు ప్రయోజనం దక్కడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రిజర్వేషన్ల సడలింపు వ్యవహారం ప్రభుత్వంలో పెద్ద దుమారమే రేపుతోంది. ఎస్సీ, ఎస్టీలకు సడలింపు ఇస్తే మిగతా వారి సంగతేంటని అడుగుతున్నారు. కొందరిపై ప్రేమ కురిపిస్తూ మరికొందరిపై నిర్లక్ష్యం తగదని సూచిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. దీంతో అగ్రవర్ణాలు సైతం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి రగులుతోంది. భవిష్యత్ మరింత అంధకారంగా మారబోతోంది. అత్యవసర సేవలందించే రంగాలైన పోలీసు, వైద్య శాఖలు మినహా అన్ని రంగాల్లో ఉద్యోగాల భర్తీ అనేది ఉండదనే తెలుస్తోంది. దీంతో కాంటాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై అనుకోని విధంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.