CM Jagan- Amaravati: ‘వీడికైతే మా మరదలను ఎరవేశావు. మిగతా వారికి ఏంచేశావు అంటాడు’ మిర్చి సినిమాలో హీరో ప్రభాష్ కు బ్రాహ్మానందం. వారందర్నీకూడా వాడేశాను అన్న ప్రభాష్ సమాధానానికి ‘అందరికీ వాడేశావా’? అని అమాయకంగా బదులిస్తాడు బ్రహ్మానందం. ఏపీలో సీఎం జగన్ వైఖరి దీనికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తన రాజకీయ యోగం కోసం ఎన్నికల ముందు అన్నివర్గాలను ఆయన వాడేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూడా కొన్నివర్గాలను యథేచ్ఛగా ఆయన వాడేసుకున్నారు. అయితే గత మూడేళ్లుగా చెప్పించే చెబుతున్న జగన్ మాటలను వినిప్రజలు నవ్వుకోవడం ప్రారంభించారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తంగం విన్నవారు మాత్రం మరీ మేము ‘వెధవల్లా కనిపిస్తున్నామా’ అంటూ ప్రశ్నించుకుంటున్నారు. అలా మాట్లాడేందుకు ఆయనకు ఎలా మనసొస్తోందని చర్చించుకుంటున్నారు. గత మూడున్నరేళ్లుగా చెబుతున్న మాటలనే మళ్లీ మళ్లీ రిపీట్ చేయడంతో ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇప్పటికీ తాను తొలిసారి సీఎం అయినట్టు పరిపక్వత లేని వ్యాఖ్యాలనే జగన్ చేస్తున్నారు. ఓ కులం, ఓ ప్రాంతం, అవినీతి అంటూ చంద్రబాబు చుట్టూనే తన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. చివరికి ప్రాంతీయ విధ్వేషాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారు. దిగజారి కామెంట్స్ చేస్తున్నారు.కానీ ఇవన్నీ జగన్ కు తెలియనివి కాదు. తన పాలనలో వైఫల్యాలే లేవన్నట్టు ఆయన వ్యవహరించడంలో తప్పులేదు కానీ.. గత మూడేళ్లుగా ఆయన పాలనను ప్రజలు కళ్లెదురుగా చూస్తునే ఉన్నారు.
నాటి మాటలు ఎన్నో…
విపక్షంలో జగన్ ఎన్నెన్ని మాటలు అన్నారు. ఏవేవో భ్రమలు కల్పించారు. అలవికాని హామీలను సైతం ఇచ్చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే సంజీవినిగా పేర్కొన్నారు. స్పెషల్ స్టేటష్ తో ప్రతీ జిల్లా హైదరాబాద్ అంత అభివృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు అసలు ఆదాయపు పన్నే కట్టాల్సిన పనిలేదన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ నాడు ఎంతో మంది ఈ మాటలను నమ్మిన వారు తెగ మెచ్చుకున్నారు. దేశంలో ఇటువంటి నేత ఉండడని భావించారు. కనీవినీ ఎరుగని రీతిలో గెలుపు తెచ్చి పెట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన మూడో రోజు అపర సంజీవిని ప్రత్యేక హోదాను జగన్ తాకట్టు పెట్టేశారు. కేంద్రం దయతలస్తేనే హోదా వస్తుందని మడతపెచీ వేశారు. దేవుడిపై భారం, నింద రెండూ మోపీ హోదాను పూర్తిగా నిర్జీవం చేశారు.
మాట తప్పమని...
‘అమరావతి రాజధానికి తమ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు సమీకరించిన భూములు చాలవు. మరింత ఎక్కువగా భూములు సేకరించి వీలైనంత త్వరగా రాజధానినిర్మాణ పనులు పూర్తిచేయాలి’ 2014లో విపక్ష నేతగా సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇది. కానీ అదే అసెంబ్లీ సాక్షిగా ఆయన అమరావతిపై ప్రస్తుతం చేసిన ప్రకటనలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. అప్పటి జగనేనా అని అనుమానం వస్తోంది. అప్పట్లో ఎన్నెన్ని మాటలు చెప్పారు. విపక్ష నేతగా నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే అప్పటికీ ..ఇప్పటికీ మారింది కేవలం అధికారమే. నాడు విపక్ష నేతగా ఒక వైపు ఉంటే.. ఇప్పడు అధికార పక్షంలోకి రావడంతో అసెంబ్లీలో ప్లేస్ మారింది. అంతమాత్రానికే నిజాలు అబద్ధాలు అయిపోయాయి. అబద్దాలు నిజాలుగా మారిపోయాయి. వాస్తవానికి సీఎం జగన్ ఎదురుగా కాగితం లేకుండా గణాంకాలు మాట్లాడలేరు. తబ్బిబ్బవుతుంటారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయిన సందర్భాలున్నాయి. కానీ అమరావతి విషయంలో ఆయన గణాంకాలతో ఇట్టే మాట్లాడేశారు. రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతాయని.. అంత సొమ్ము ప్రభుత్వం వద్ద ఉంటే అభివృద్ధి చేయనా అంటూ ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడం రక్తికట్టించింది. అందుకే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. తద్వారా విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది. దానిని కొత్తగా అభివృద్ధి చేయడాని ఏమీ లేదని ఒప్పుకున్నారు.
వికేంద్రీకరణకు సరికొత్త భాష్యం..
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాలనా వికేంద్రీకరణకు జగన్ సరికొత్త భాష్యం చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో మూడు రాజధానులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తాము పాలన వికేంద్రీకరణ చెప్పుకొచ్చినట్టు చెప్పారు. దీనికి వలంటీరు వ్యవస్థను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇంటింటికీ రేషన్ నుంచి పౌరసేవలు అందిస్తున్నది పాలన వికేంద్రీకరణలో భాగామేనన్నారు. అంటే రూ.2,500 పింఛను అందించడానికి నెలకు వలంటీరుకు రూ.5 వేలు వేతనం అందించడమే పాలనా వికేంద్రీకరణ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అమరావతిని అచేతనంగా మార్చాలని..
అమరావతి ఒక సంపద సృష్టి కేంద్రం. దీనిని ప్రపంచ ఆర్థిక వేత్తలు ఎప్పుడో ధ్రువీకరించారు. నాలుగు, ఐదు లక్షల కోట్లు పెట్టుబడితే.. స్వల్పకాలంలో అవి తిరిగి రెట్టింపు ఆదాయం తెచ్చి పెడుతుందని కూడా చెప్పారు. ప్రణాళికాబద్ధంగా అమరావతిని నిర్మిస్తే అవశేష ఆంధ్రప్రదేశ్ అప్పులను స్వల్పకాలంలో తీర్చగల విశ్వ నగరంగా మారుతుందని కూడా చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల సంపదను సృష్టించగల సామర్ధ్యం దానికి ఉందని కూడా గుర్తించారు. కానీ అవేవీ ప్రస్తావించకుండా అమరావతిని చంపేస్తామన్నట్టు జగన్ వ్యాఖ్యానాలు చేశారు. సమీకరించిన భూములను విక్రయించి ఆదాయం సృష్టిస్తామన్న సీఎం జగన్ గణాంకాలు విమర్శల పాలవుతున్నాయి. తనకు ఏమీ తెలియదన్నట్టు నటిస్తున్న జగన్ ప్రజలకు కూడా ఏమీ తెలియదన్నట్టు భావిస్తున్నారు. కానీ రచ్చబండపై కూర్చొని రాష్ట్ర గణాంకాలు చదివే నేర్పరితనం ఏపీ ప్రజలకు ఉందన్న విషయం జగన్ కు తెలియడం లేదు. అయితే రాష్ట్రంలో మరోసారి అధికారి మార్పిడి జరిగితే పాలక నేతలు పోల్చిన శ్మశానం బంగారంలా మారిపోతోంది. ఎకరం భూమి రూ.50 కోట్లకు పైగా ఎగబాకుతుందన్న విషయాన్ని గుర్తించాలి. సొంత గ్రామాల్లో, సొంత మండలంలో, సొంత జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వం.. అమరావతిలో రాష్ట్రంలో అర్హలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్న ప్రయత్నం అబాసులపాలుకాక తప్పదు.
ఎప్పటికప్పుడు తన విశ్వప్రదర్శన…
విపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏన్ని కబుర్లు అయినా చెప్పొచ్చు. ఎన్ని హామీలైన ఇవ్వొచ్చు.కానీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతుందని జగన్ గ్రహించడం లేదు. పైగా వచ్చే ఎన్నికలతో పాటు మరో 30 ఏళ్లు తన ఏలుబడిలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు. తన మాటలే రాష్ట్ర ప్రజలకు శాసనమని నమ్ముతున్నారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ నే ఆయన తేలికగా తీసుకున్నారు. ఒక పారసిటమల్ మాత్రతో పాటు బ్లీచింగ్ పౌడర్ అంటే చాలని తేల్చేశారు. అప్పటి నుంచి సాగుతున్న ఆయన విశ్వరూప ప్రదర్శన ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా జగన్ మరోమాట చెప్పుకొచ్చారు. రాజధాని చుట్టు పక్కల ప్రాంతాలను తానే అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా ప్రకటించారు. అమరావతి భ్రమరావతిగా తేల్చేశారు. కానీ నిజం తెలిసిన వారు మాత్రం నవ్వుకుంటున్నారు. గతుకుల రోడ్డుకు ప్యాచ్ వర్కు చేయని వారు అభివృద్ధి చేశారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో తడికల బస్టాండ్, విమానాశ్రాయ గ్రాఫిక్స్ ను గుర్తుకు తెచ్చకుంటున్నారు. అటు సీఎం నోట ప్రాంతీయ విధ్వేషాల మాట కూడా బయటకు వచ్చింది. అమరావతి రాజధానికి మద్దతుగా చేపడుతున్న మహా పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు చూసి ఊరుకుంటారా? అని సానుభూతి వ్యక్తం చేశారు. తమ ప్రాంతం కోసం, ప్రభుత్వ వైఫల్యం కోసం న్యాయబద్ధంగా పోరాడుతున్న వారిని అడ్డుకోవాలని సూచించినట్టుంది జగన్ మాటలు. మొత్తానికైతే జగన్ తన పత్తిగింజల మాటలతో మరింత పలచన అయ్యారు. ప్రజలు నవ్వుకునేందుకుఅవకాశమిచ్చారు.