CM Jagan: చంద్రబాబుకు దక్కుతున్న ప్రజాదరణ చూసి వైసిపి కలవరపడుతోందా? ఎన్నికల ముంగిట తమకు ఇబ్బంది తప్పదని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు గంటల్లో విజయవాడలోని తన ఇంటికి చేరుకోవాల్సిన చంద్రబాబుకు.. దారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలకడంతో 14 గంటల సమయం పట్టిందని టిడిపి సంబరాలు చేసుకుంటుంది. అటు హైదరాబాదులో తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇదే రకమైన స్వాగతం లభించింది. అయితే ఇవన్నీ అధికార వైసీపీకి మింగుడు పడని అంశాలే. జాగ్రత్త పడకుంటే వైసీపీకి దెబ్బ తప్పదన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
అటు చంద్రబాబు విషయంలో వైసీపీ నేతల ప్రకటనలు కూడా వారిలోనున్న డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. కోర్టు నిబంధనలను పాటించలేదని చెబుతూ చంద్రబాబుపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ర్యాలీలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా రోగాలు అంటూ సంబోధించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని టిడిపి నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణను ముఖ్యంగా వైసిపి నేతలు సీరియస్ గానే తీసుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితికి ముమ్మాటికీ తమ అధినేత జగన్ కారణమని భావిస్తున్నారు.
చంద్రబాబు బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆయనలో సానుభూతి కోణం ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం కనిపించింది. కోర్టు ఆదేశాలు ఉండడంతో ఎక్కడ రాజకీయ అంశాల జోలికి పోలేదు. కానీ సెంటిమెంటు రగిలించే ప్రయత్నంలో భాగంగా కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో తనపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసినప్పుడు సైతం ఇదే మాదిరిగా సానుభూతి వ్యక్తం అవుతుందని భావించి చతికిల పడ్డారు. అయితే అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. విపక్ష నాయకుల సైతం ఈ తరహా పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం తగదని చెప్పుకొచ్చారు. అయితే అది సానుభూతిగా మారుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన సమావేశాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇవి టిడిపికి ప్రయోజనం కలిగించినవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు విషయంలో సానుభూతితో పాటు ప్రజా వ్యతిరేక తోడైతే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్టు సీఎం జగన్ నడుచుకుంటే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి మరి.