Volunteers In AP: వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వీరు తూచా తప్పకుండా పూర్తి చేసి చూపుతున్నారు. దేశంలో ఇంతటి మహోన్నత వ్యవస్థను ఏపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, ఇదంతా ప్రస్తుతం. రాబోవు రోజులు వలంటీర్లకు కఠినంగా మారబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో సాగనంపేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని గాలికోదిలేసి సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. నవరత్నాలను ప్రతి ఇంటి దరి చేర్చాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. పట్టణ, గ్రామ స్థాయిలో సచివాలయాలను ఏర్పాటు చేసి, వాటికి వలంటీర్లను అనుసంధానం చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించారు. రూ.5000 గౌరవ వేతనంగా నిర్ణయించారు. సంక్షేమ పథకాలు అందించేందుకు అర్హుల ఎంపికతో పాటు అనర్హులను తీసివేయడం కూడా వీరి బాధ్యత. ఇటీవల ఏపీని సందర్శించిన మహారాష్ట్ర అధికారులు వలంటీర్ల వ్యవస్థను విప్లవాత్మకమైనదిగా అభివర్ణించారు.
వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు మొదటి నుంచి వివాదాస్పద అంశంగానే ఉంది. వీరి నియామకం ఏ చట్టబద్ధత ప్రకారం చేశారో తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలు కూడా వలంటీర్లపై గుర్రుగా ఉన్నారు. ముందు ప్రభుత్వ విధానంపై సరే అన్నా, ఆ తరువాత వారు స్థానిక ప్రజల్లో పరువు పోగొట్టుకున్న తరువాత విమర్శించడం మొదలుపెట్టారు. అంతేగాక, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రక రకాల నిబంధనలను అమలు పరుస్తూ అర్హులను కూడా అనర్హులు చేస్తున్నారని వలంటీర్లను తిట్టిపోస్తున్నారు.
వలంటీర్ల వ్యవస్థపై ఇటీవల హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరి నియామకానికి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది కదా? అని అడిగింది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని సెర్ప్ సీఈవోను ప్రశ్నించింది. ఈ మొత్తం వివాదాల నేపథ్యంలో వలంటీర్లను విడతల వారీగా తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని తెలుస్తోంది.
వలంటీర్లను తొలగించేందుకు జారీ చేసిన మార్గదర్శకాల్లో ముందుగా, బాధ్యాతారహితంగా, హాజరు సరిగా లేకపోవడం, అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా లేదా అన్నీ ఉన్నా వెంటనే మెమో జారీ చేస్తారు. దీనిపై సదరు వలంటీరు వివరన ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనిపై మున్సిపల్ కమిషనరు లేదా పంచాయతీ కార్యదర్శికి రిపోర్టు అందిస్తారు. వలంటీర్లు ఏ విధమైన తప్పు చేయనట్లుగా భావిస్తే ఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పడి కమిటీకి 15 రోజుల్లోగా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ ఆ కమిటీ సంతృప్తి చెందకపోతే వలంటీర్లను తొలగిస్తారు.