Pawan Kalyan CM: ఏపీలో రాజ్యాధికారం కాపులకు చేరువవుతోందా? పవన్ రూపంలో కాపుల చిరకాల వాంఛ తీరనుందా? పవన్ సీఎం అయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందా? పవన్ ను ముందుపెట్టి కాపుల మనసును గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. దశాబ్దాలుగా ఏపీలో రెండు సామాజికవర్గాలే రాజకీయ అధికార పీఠాన్ని పంచుకుంటున్నాయి. మూడో సామాజికవర్గమైన కాపులు సంఖ్యాబలంగా ఎక్కువ. కానీ ఆ వర్గానికి అధికార పీఠం దక్కకుండా ఆ రెండు వర్గాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయితే ఈసారి ఆ చాన్స్ కనబడడం లేదు. రెండు సామాజికవర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం పతాక స్థాయికి వెళ్లిపోగా.. వారి గెలుపోటములు నిర్దేశించే స్థాయికి పవన్ చేరుకున్నారు. అందులో ఒకరికి పవన్ సపోర్టు అనివార్యంగా మారింది.

అయితే ఏపీలో మారిన రాజకీయ సమీకరణలతో పవన్ పేరు సీఎం పదవికి బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా పవన్ కనిపిస్తున్నారు. అటు విపక్ష నేతగా చంద్రబాబు ఫెయిల్యూర్స్ పవన్ కు కలిసి వస్తోంది. జగన్ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. దానిని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. అందుకే పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని తప్పకుండా తలవంచక తప్పని పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. ఇటు టీడీపీ పరిస్థితి అలానే ఉంది. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి టీడీపీకి ఎదురవుతోంది. ఫలితంగా పవన్ లో అనూహ్య రాజకీయ పరిణితి కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో పవన్ ఓటమి చవిచూశారు. తాను స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం నుంచి కూడా ఓడిపోయారు. దీంతో పార్టీ పని క్లోజ్ అని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. పవన్ కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. కానీ వీలైనంత త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. ఏకంగా సీఎం సీటుపైనే గురిపెట్టారు అనే కంటే.. అదే పీఠం తనను వెతుక్కొని వచ్చేలా పావులు కదిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక డిమాండ్ కలిగేలా వ్యవహరించారు. ప్రధాని మోదీ, రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడేంతగా తన అవసరాన్ని పెంచుకున్నారు. తన సాయం వారికి అనివార్యంగా మార్చుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు సీఎం జగన్ కు ప్రత్యామ్నాయంగా పవన్ పేరు వినిపించడం.

జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఏనాడో సీఎం పదవి ఆఫర్ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ తో భేటీ అవుతున్న చంద్రబాబు కూడా దీనిపై కొన్ని సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. సీఎం పదవి షేర్ చేసుకుందామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ముందుగా జగన్ ను గద్దె దించి తరువాత పదవి పంపకాల గురించి మాట్లాడుకుందామని డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు కేటాయించినా.. సీఎం పదవికి మాత్రం షేరింగ్ రూపంలో ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది. అంటే అటు బీజేపీ నుంచి. ఇటు టీడీపీ నుంచి పవన్ కు సీఎం పదవి ఆఫర్ ఉన్నట్టు తేలిపోయింది. పవన్ కు సీఎం పదవి అన్న సంకేతాలు కాపుల్లోకి వెళితే మాత్రం ఏపీ సమాజంలో మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న వారు గుంపగుత్తిగా కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అందుకే టీడీపీ ఈ సాహస నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.