https://oktelugu.com/

Telangana Assembly Election: వంద గజాల స్థలం.. ఎన్నికలవేళ వారి పంట పండింది

"డబ్బులు పంచను, ముందు పోయను" అని కేటీఆర్ లెవెల్ లో మాటలు చెప్తే ఇప్పుడు ఓట్లు పడే రోజులు కావు. మీకు ఓటేయాలంటే మాకేం ఇస్తారు అని అడిగే రోజులు.

Written By: , Updated On : October 21, 2023 / 06:02 PM IST
Telangana Assembly Election

Telangana Assembly Election

Follow us on

Telangana Assembly Election: తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా హామీలు ఇస్తున్నాయి. పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని తాయిలాలు ప్రకటిస్తున్నాయి. మరి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి ఉద్యోగం ఉంటుంది కనుక పార్టీలు ఎటువంటి హామీలు ఇవ్వడానికి కుదరదు.. ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందేందుకు వారికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వారి ఓట్లను పొందాలంటే ఏం చేయాలి? వారిని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి? ఆ సూత్రం ఏంటో భారత రాష్ట్ర సమితిని అడిగితే సవివరంగా చెబుతుంది.

“డబ్బులు పంచను, ముందు పోయను” అని కేటీఆర్ లెవెల్ లో మాటలు చెప్తే ఇప్పుడు ఓట్లు పడే రోజులు కావు. మీకు ఓటేయాలంటే మాకేం ఇస్తారు అని అడిగే రోజులు. కాబట్టి అధికార భారత రాష్ట్ర సమితి అడిగిన వారందరి కోరికలు తీరుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ఎనలేని ఉదారత చూపుతోంది. బదిలీల విషయంలో పది సంవత్సరాలపాటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టిన భారత రాష్ట్ర సమితి.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారు అడిగినవన్నీ చేసిపెడుతోంది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో ఉపాధ్యాయ సంఘాలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించింది. వీటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే భూమి పూజ నిర్వహించింది. అంతటితో భారత రాష్ట్ర సమితి ఆగలేదు. ఉపాధ్యాయులకు ఓడీ సౌకర్యం కల్పించింది. ఉపాధ్యాయ సంఘాల్లో కీలకంగా ఉన్న వారికి ఇప్పుడు వంద గజాల ఇళ్లస్థలం ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు భారత రాష్ట్ర సమితి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి నుంచి కీలక నేతలు పోటీలో ఉండడం, ప్రత్యర్థి పార్టీలో నుంచి కూడా బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీ కంటే ముందుగానే తమ పరిస్థితిని చక్కదిద్దుకుంటున్నారు. దీనికోసం ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లను గంపగుత్తగా కొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆయా గ్రామాల్లో విశేషమైన సంబంధాలు ఉంటాయి. పైగా వారు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేయగలరు. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఇప్పటికే శ్రీవారు ప్రాంతాల్లో కొంతమంది అధికార పార్టీ నాయకులు 100 గజాల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీకి దగ్గరగా ఉండే ఉపాధ్యాయ సంఘం లోని కీలక నాయకులు ఇందుకు సంబంధించి మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అలాంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి అధికార పార్టీ నాయకులు ఓడి సౌకర్యం కట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి తోచిన విధంగా వారు పని చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ పరిణామం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే విద్యాబోధన కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.