Homeఆంధ్రప్రదేశ్‌YCP Politics : వైసిపి ప్రమాదంలో ఉందా? నేతల్లో టెన్షన్ కి కారణమేంటి?

YCP Politics : వైసిపి ప్రమాదంలో ఉందా? నేతల్లో టెన్షన్ కి కారణమేంటి?

YCP Politics :: ఏపీలో అధికార వైసిపి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రజలకు ఎన్నో చేశాం.. తమకు తిరుగు లేదని చెబుతున్న నాయకులు.. ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న ఏ కార్యక్రమమూ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సామాజిక సాధికార బస్సు యాత్ర ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కీలక నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేయడం కనిపించింది. అటు అంతర్గత సర్వేలు పార్టీ హై కమాండ్కు కలవర పెడుతున్నాయి. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులు వైసీపీ గ్రాఫ్ ను గణనీయంగా తగ్గించాలని పరిశీలకు అభిప్రాయపడుతున్నారు.

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. మధ్యంతర బెయిల్ పై వచ్చారు. అయితే ఈ విషయంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందని విమర్శలు ఉన్నాయి. పాలనను గాలికి వదిలేసి రాజకీయ అంశాలకే జగన్ ప్రాధాన్యమిచ్చారన్న టాక్ ఉంది. అయితే దీనిని నిజం చేస్తున్నట్టు వైసిపి నేతల ప్రకటనలు ఉండడం విశేషం. మేం ఎంత చెబుతున్నా.. చంద్రబాబు విషయంలో ప్రజలు ఎందుకు నమ్మడం లేదని… జగన్ తర్వాత శక్తివంతుడైన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు చెబుతుండడం వైసిపి స్థితిని తెలియజేస్తోంది. అంతర్గత సర్వేల్లో వచ్చిన ఫలితాలకు అనుగుణంగానే.. ఆయన మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల జాతీయ మీడియా సంస్థల పేరిట వెల్లడైన సర్వేల ఫలితాలు.. వాస్తవానికి దూరంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏకపక్ష విజయాన్ని ఆ సంస్థలు వైసిపికి కట్టబెట్టాయి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో వైసిపి పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.ఇటువంటి తరుణంలో వైసీపీకి ఏకపక్ష విజయం సాధ్యమా? అన్న ప్రశ్న సామాన్యుల నుంచి సైతం వినిపించింది. అందుకే జాతీయ సంస్థల పేరిట వెల్లడవుతున్న సర్వేల విషయంలో ఏపీ ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. వాస్తవానికి అంతర్గత సర్వేల్లో వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం అనుమానమే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ ప్రమాదంలో ఉందని.. ఇదే ట్రెండ్ కొనసాగితే పుట్టి మునగడం ఖాయమని మంత్రుల సైతం అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. జగన్ బయటకు రాకుండా.. బస్సు యాత్రల పేరిట తమను పంపిస్తే చాలదని.. ఆయన ప్రజల్లోకి రాకుండా తామేమి చేయలేమని వైసిపి నేతల నుంచి నిట్టూర్పు మాటలు వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version