ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల రంగులు మారుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీపై భయాందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ పేర్కొనడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కై వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. దీంతో రెండు పార్టీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు కలవరం సృష్టిస్తున్నాయి. రాష్ర్టంలో దూసుకుపోతున్న వైసీపీకి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాని మాటలు సంచలనం కలిగిస్తున్నాయి.
ఇప్పటికే టీడీపీ బీజేపీ మద్దతు కోసం లేఖలు రాస్తున్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ర్టప్రభుత్వ నిర్వహణకు అప్పులు తీసుకుంటే వాటికి కూడా ఆక్షేపణ చెబుతూ నిధులు రాకుండా చేస్తోందని విమర్శించారు. దీంతో వైసీపీ దిక్కతోచని స్థితిలో పడిపోయింది. రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ చెబుతున్నారు
నాని చెబుతున్న మాటలు ఆయనలో నుంచి వచ్చాయా లేక ఇంకా ఏవైనా ఆధారాలతో మాట్లాడారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బీజేపీతో టచ్ లో ఉంటున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే నాని ఇలా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా నాని వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి.
ఏపీలో బీజేపీ నేతలు ఎప్పుడు కూడా వైసీపీని ఇంత దారుణంగా విమర్శించిన దాఖలాలు లేకపోయినా నాని మాత్రం బీజేపీని అప్రదిష్ట పాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బీజేపీకి లింకులు పెట్టి లబ్ధిపొందాలని వైసీపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని బజారుకీడ్చే క్రమంలో వైసీపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఇలా మాట్లాడడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.