TDP -Janasena: పవన్ వ్యూహం కరెక్టేనా? టిడిపి తో కలిసి నడవాలనుకోవడం సరైన నిర్ణయమేనా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో గత దశాబ్ద కాలంగా ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపిల మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది. ఇరు పార్టీల అధినేతల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒకరు జైలు కెళ్ళి రాగా.. మరొకరు జైలులో ఉన్నారు.ఇటువంటి తరుణంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న జనసేన పొత్తులు కుదుర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండు పార్టీలకు సమ దూరం పాటించి మూడో పార్టీగా ముందుకు రావలసిన అవసరం జనసేన పై ఉంది. కానీ పవన్ టిడిపితో కలిసి నడిచేందుకే నిర్ణయం తీసుకున్నారు.
జగన్ ను పవన్ అవినీతిపరుడని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును వెనుకేసుకొస్తున్నారు. బాబు కడిగిన ముత్యమని చెబుతున్నారు. జగన్ పై కోపంతో, చంద్రబాబుపై అభిమానంతో ఆ మాట చెప్పవచ్చు. కానీ న్యాయస్థానాల్లో చంద్రబాబు అవినీతి నిర్ధారణ అయితే మాత్రం పవన్ కు ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కనీసం కోర్టు నిర్ధారించే వరకైనా పవన్ వేచి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జనసేన కొత్తగా పుట్టిన పార్టీ. అసలు అధికారమే దక్కలేదు. అందుకే పవన్ పై ఎటువంటి అవినీతి మరకలు లేవు. అలాంటి జనసేన టిడిపి తో పొత్తు పెట్టుకోవడం వ్యూహాత్మక తప్పిదమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ఆది నుంచి చంద్రబాబు విషయంలో పవన్ సానుకూలంగానే ఉన్నారు. చంద్రబాబు మంచి పాలన దక్షుడిగా చెబుతూ వచ్చారు. అయితే ఇలా చెప్పుకోవడానికి కూడా గొప్పతనం ఉండాలి. ఎలాంటి రాజకీయ పార్టీ అయినా.. తమ పార్టీ ప్రయోజనాలకి పెద్దపీట వేస్తుంది. కానీ పవన్ మాత్రం రాజకీయ ప్రయోజనాలను బేరీజు వేసుకోకుండా మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే చేశారు. ఈ తాజా పొత్తులతో రెండు పార్టీలకు ప్రయోజనం కలగవచ్చు. కానీ పవర్ షేరింగ్ మాట ఏమిటి? పవన్ ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి సంగతి ఏంటన్నది సైతం పవన్ ఆలోచించి ఉండాల్సింది.
జనసేన లో ఉండేది పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. వారు పవన్ మాదిరిగా ఆలోచించరు. జగన్ దిగిపోవాలి అనే ఒకే సూత్రాన్ని పవన్ నమ్ముతున్నారు. అయితే జగన్ దిగిపోవడమే కాదు.. పవన్ అధికారం చేపట్టాలని జనసైనికులు బలంగా కోరుతున్నారు. అటువంటి వారికి చంద్రబాబు సీఎం అని చెబితే.. పవన్ మరి కారా? అని నిరాశ చెందే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ పొత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఒకటి మాత్రం నిస్సంకోచంగా చెప్పగలం. ఈ పొత్తుతో లాభంలో సింహభాగం తెలుగుదేశం పార్టీదే. వచ్చే ఎన్నికల్లో విజయం పై అనుమానంగా ఉన్న ఆ పార్టీపై పవన్ పాలు పోశారు. జనసేనకు, తనకు ప్రయోజనం అనే మాట పక్కన పెట్టి.. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అంటూ ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే జనసైనికుల నోటికి తాళం వేశారు.అయితే రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం పవన్ నైజం. అందుకే పార్టీ శ్రేణులు ఆయనను అమితంగా అభిమానిస్తాయి. టిడిపి తో పొత్తు సరే.. కానీ దానికి కొన్ని షరతులు వర్తింపజేయాలన్నదే జనసైనికుల అభిమతం.