
సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యమైన పథకాల్లో అమ్మఒడి కూడా ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకం రాష్ట్రంలోని మహిళల దృష్టిని ఆకర్షించడంతో పాటు వైసీపీ విజయానికి సైతం కారణమైంది. పేదింటి పిల్లలు, తల్లులకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ద్వారా సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆందజేసేలా చర్యలు చేపట్టింది.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
తొలి ఏడాది దాదాపు 43 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ప్రభుత్వం తొలి ఏడాది 75 శాతం హాజరు అనే నిబంధనను తొలగించగా రెండో ఏడాది నుంచి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. కట్ చేస్తే పథకం అమలైన రెండు నెలలకే పరిస్థితి మారిపోయింది. దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడాల్లేకుండా 13 జిల్లాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా ఆ కేసులలో 80,000కు పైగా కేసులు తూర్పుగోదావరి జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. వేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల ద్వారా, కరోనా నిబంధనలు పాటించేలా చేసి క్లాసులు జరిగేలా చేసి విద్యార్థులు నష్టపోకుండా చేయాలని భావిస్తోంది.
అయితే ఈ మహమ్మారి ప్రభావం వల్ల పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. అదే సమయంలో కరోనా, లాక్ డౌన్ వల్ల ఖాళీ ఖజానా ఏపీ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తోంది. దీంతో అమ్మఒడి పథకం అమలు అంత తేలిక కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి అమ్మఒడి పథకం అమలు కష్టమేనని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.
Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?