Eenadu: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. తెలంగాణలో మరో ఐదు రోజుల వ్యవధిలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితాలు ఏపీ పై విశేషంగా ప్రభావం చూపనున్నాయి. అయితే ఏపీలో పార్టీల మధ్య ఫైట్ కంటే.. మీడియా వ్యవస్థలు అంతకుమించి తలపడుతుండడం విశేషం. ఇప్పటికే నీలి మీడియా, ఎల్లో మీడియా, కూలి మీడియాలుగా విడిపోయి పోరాడుతున్నాయి. అవసరాల కోసం నేతలకంటే మీడియా యాజమాన్యాలే రంగులు మార్చుతుండడం విశేషం.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది తమ ప్రత్యర్థులను దెబ్బతీయడంతో పాటు తమ వారిని అధికారంలోకి తేవడానికి పత్రికలు పరితపిస్తున్నాయి. అధికార వైసిపికి సాక్షి, విపక్ష టిడిపికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కరపత్రికలుగా పనిచేస్తున్నాయి. తమ అభిప్రాయాలను ప్రజలపై బలంగా రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యుడు చెంతకు తమ పత్రికలను చేర్చేందుకు రకరకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. నగదు అనేసరికి పాఠకుడు ముఖం చాటేస్తుండడంతో ఉచితంగా పంచేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే సాక్షి దినపత్రికను హెయిర్ కటింగ్ సెలూన్ లకు, చిన్నపాటి దుకాణాలకు ఉచితంగా వేస్తున్నారు. ఇది చాలదన్నట్టు డ్వాక్రా మహిళలకు, సమాజంలో యాక్టివ్ గా ఉండే వారికి ఉచితంగా పంచి పెట్టేస్తున్నారు. ఇలా ఉచితంగా అందిస్తున్న సొమ్మును నియోజకవర్గ ఎమ్మెల్యేలు, బాధ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు వలంటీర్లకు సాక్షి పేపర్ ను పంపిణీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఈనాడు పత్రికను ఉచితంగా పంపిణీ చేయాలని యాజమాన్యం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు కేవలం నాలుగైదు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజ గురువు రామోజీ ఒక స్కీమును అందుబాటులోకి తెచ్చారు. ఈనాడు పత్రికకు చందాదారులుగా చేరితే.. ఆదివారం నాడు ఉచితంగా పేపర్ అందిస్తామని ఆఫర్ ప్రకటించారు. అయితే ఇప్పటికే హైయెస్ట్ సర్కులేషన్ జాబితాలో ఈనాడు ఉంది. సర్క్యులేషన్ పెంచుకుంటే రామోజీరావుకు కొత్తగా వచ్చేది లేదు. కానీ ఇప్పటికే సాక్షి వాలంటీర్లతో పాటు ఉచితంగా పత్రికను పంచి పెడుతుండటంతో.. ఈనాడుకు అధిగమించే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలోనే రామోజీరావు ఈ కొత్త ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా మాత్రం విభిన్నంగా ప్రచారం చేస్తోంది. ఉచిత పంపిణీ భారాన్ని చంద్రబాబు మోసేందుకు ముందుకు వచ్చారని.. అందుకే ఈ ఉచిత పంపిణీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.
అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈనాడు ప్రత్యేకంగా ఏదో ప్లాన్ చేస్తోంది. గతంలో పాంచ జన్యం పేరుతో ఎన్నికల కథనాలు రాసేవి. అవి బహుళ ప్రాచుర్యం పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న ఈనాడు.. గత ఎన్నికల శీర్షికలను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ” ఈనాడు పేపరును రాష్ట్రంలో పలుచోట్ల ఉచితంగా ఇళ్ల ముందు వేస్తున్నారట. బలవంతంగా ఎల్లో స్టెరాయిడ్స్ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ? ‘అనుకుల’ మీడియా ఏది రాసినా, చూపినా ప్రజలు నమ్మడం లేదే రామయ్య గారు…పరువు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు. వంద కిలోమీటర్ల లోతుకు జారిపోయిన నారా వారిని చెరుకూరి వాటిని బయటకు లాగడం కష్టం” అంటూ పోస్ట్ పెట్టారు. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ఈనాడు సరే.. మరి మీ సాక్షి పరిస్థితి ఏమిటని టిడిపి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈనాడు పేపరును రాష్ట్రంలో పలుచోట్ల ఉచితంగా ఇళ్ల ముందు వేస్తున్నారట. బలవంతంగా ఎల్లో స్టెరాయిడ్స్ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ? ‘అనుకుల’ మీడియా ఏది రాసినా, చూపినా ప్రజలు నమ్మడం లేదే రామయ్య గారు…పరువు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు. వంద కిలోమీటర్ల లోతుకు జారిపోయిన నారా వారిని…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023