spot_img
Homeఅంతర్జాతీయంIran crisis : ఇరాన్‌ సంక్షోభం.. ట్రంప్‌ను నమ్ముకుని నట్టేట మునిగిన ప్రజలు!

Iran crisis : ఇరాన్‌ సంక్షోభం.. ట్రంప్‌ను నమ్ముకుని నట్టేట మునిగిన ప్రజలు!

Iran crisis : ఇరాన్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తర్జన భర్జన వైఖరి ప్రపంచాన్నే కాకుండా, అక్కడి ప్రజల్ని కూడా అయోమయంలోకి నెట్టింది. ఒక వైపు కఠిన సైనిక చర్యలకు సిద్ధమన్న సందేశాలు, మరో వైపు చర్చలు, ఒప్పందాల మాటలు, మధ్య మధ్యలో ఇరాన్‌ పరిపాలనను పొగడ్తలతో ప్రస్తావించిన ఆయన సోషల్‌ మీడియా పోస్టులు నిరసనకారుల్లో గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో, ఇరాన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ట్రంప్‌ నిజంగా ఎంతవరకు అంచనా వేశాడనే ప్రశ్న చర్చనీయాంశమైంది.

దశాబ్దాలుగా అసంతృప్తి..
మతాధారిత పాలనపై సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఒకవైపు.. ఇంకోవైపు పెరిగిన ఆర్థిక ఇబ్బందులు కారణంగా సామాజిక మాధ్యమాల పిలుపుతో రాజధాని టెహ్రాన్‌తోపాటు పెద్ద పట్టణాల్లో డిసెంబర్‌ చివరి వారంలో భారీ నిరసనలు చెలరేగాయి. అదే సమయంలో వెనెజులాలో అమెరికా సైనిక జోక్యంతో అక్కడి అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అరెస్ట్‌ చేశారనే వార్తలతో, ఇరాన్‌ ప్రజల్లో కూడా ‘‘మాకు కూడా అమెరికా సహాయం చేస్తుందేమో’’ అనే ఊహాగానాలు బలపడ్డాయి.

ట్వీట్లలో ఉద్యమానికి ఊపిరి..
నిరసనలకు మద్దతుగా ట్రంప్‌ వరుస ట్వీట్లు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ‘సహాయం చేస్తాం.. నిరసన కొనసాగించండి’, ‘లాక్డ్‌ అండ్‌ లోడెడ్‌’’ వంటి పదజాలం అక్కడి ఉద్యమకారులకు ధైర్యం నింపింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు పెట్టారు. నిరసనలు ఉధృతం అవుతుండగా, ఇరాన్‌ ప్రభుత్వం పాత పద్ధతినే అనుసరించింది. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత, భద్రతా బలగాల విస్తృత మోహరింపు, కాల్పులు, అరెస్టులు. స్నైపర్‌ దాడులు, మెషిన్‌ గన్‌ కాల్పులు, వందలాది మరణాల నేపథ్యంలో ప్రజల్లో ‘ఇప్పుడు అయినా అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుంది అనే నమ్మకం మరింత బలపడింది.

యుద్ధానికి సిద్ధమనే ప్రచారం..
మరోవైపు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ నుంచి ఇరాన్‌పై వైమానిక దాడుల కోసం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం ప్రపంచ మీడియాలో వినిపించింది. దీంతో ‘‘ఏ క్షణమైనా అమెరికా యుద్ధం మొదలెడుతుందేమో’’ అనే అంచనాతో ఇరాన్‌ నిరసనకారులంతా ఆకాశంవైపు ఎదురు చూశారు. కానీ, ట్రంప్‌ ఆకస్మికంగా స్వరం మార్చాడు. ఇరాన్‌ పాలకులు నిరసనకారుల ఉరి శిక్షలు నిలిపివేస్తామని హామీ ఇచ్చారని, అందుకే కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రకటిస్తూ, సైనిక చర్య ఉండదనే సంకేతాన్నిచ్చాడు. ఈ ప్రకటన అక్కడి ప్రజల్ని తీవ్ర నిరాశలోకి నెట్టింది.

నిరసనలపై ఎగతాళి..
ట్రంప్‌ వ్యాఖ్యలను పట్టుకుని కొందరు ఇరాన్‌ అధికారులు నిరసనలను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భయంతో చాలా మంది వెనక్కి తగ్గగా, ప్రస్తుతానికి అక్కడ ఆందోళనలు గణనీయంగా తగ్గిపోయాయి. మళ్లీ అదే స్థాయిలో నిరసనలు చెలరేగుతాయా లేదా అనేది అనిశ్చితంగా మారింది. ట్రంప్‌ వైఖరిపై ఇరాన్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆ రక్తానికి ట్రంప్‌ కూడా భాగస్వామే. ఆయన పిలుపునే నమ్మి తాము వీధుల్లోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ మమ్మల్ని బలిపశువులుగా వాడుకున్నాడు అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు విశ్లేషకులు ట్రంప్‌ వెనకడుగు కూడా ఒక వ్యూహమేనని అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఇరాన్‌ ప్రభుత్వ నమ్మకం గెలుచుకుని, తర్వాత మరో దెబ్బతో కుదుపు ఇస్తాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, నిరసనల్లో రక్తం చిందించిన సాధారణ ప్రజలు ఇప్పటి వరకు జరిగినదంతా తమ ఆశలు, ప్రాణాలు, భవిష్యత్తు రాజకీయ లెక్కల్లో బలితీసుకుపోయిన చేదు అనుభవంగానే మిగిలిపోయింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular