AP Cabinet: ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రమాణ స్వీకారంలోనే చెప్పుకొచ్చాడు. ఈ మంత్రివర్గం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత వీరి స్థానంలో కొత్త వారు వస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న ఈ సమయంలో మరోసారి ఏపీ కేబినెట్ కలలు మొదలయ్యాయి. దీనిమీద జగన్ కసరత్తు చేస్తున్నట్టు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ తను కొత్తగా చేపట్టే క్యాబినేట్ పునర్వ్యూస్థీకరణలో ఎవరిని నిలుపుకుంటారు? కొత్తగా ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు తొలగించబడుతారు? మొత్తం క్యాబినేట్ భర్తీ చేస్తారా? అన్న రకరకాల ప్రశ్నలు మంత్రులు, ఎమ్మెల్యేల్లో మెదులుతున్నాయి.
అయితే సాధారణంగా రాజకీయ వాతావరణంలో చూస్తే ప్రతి రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని భర్తీ చేయడం అనేది తప్పుడు ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ సహా మంత్రులుగా చేసిన ఎవరికి ఇంతుకు ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనుభవం లేదు. మంత్రులుగా చేసిన వారు కాదు.. జగన్ అయితే డైరెక్టు మంత్రి కాకుండానే సీఎం అయిపోయారు. మంత్రులంతా కొత్త ముఖాలే. వారు తమ శాఖల పనితీరును అర్థం చేసుకోవాలి. మంత్రిత్వశాఖలపై పట్టు సాధించారు. అధికారులతో సాన్నిహిత్యం పెంచుకోవాలి.. మంత్రిత్వశాఖలను నిర్వహించడానికి మార్గాలను కనుగొనాలి. సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి రావాలి.
సహజంగానే ఈ ప్రక్రియ రెండేళ్లలో ఎక్కువ సమయం పడుతుంది. 2 సంవత్సరాల తర్వాత వాటిని భర్తీ చేస్తే వారి పని అంతా వృథా అవుతుంది. కొత్తగా వచ్చే మంత్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రజలకు నిజమైన సంక్షేమం అందదు.
రాజకీయ దృక్కోణంలో చూస్తే సీఎం జగన్ చేపట్టే మంత్రివర్గ విస్తరణ ఒక మంచి చర్యగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. వారంతా కోపంతో రగిలిపోకుండా ఉండగలరు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రజలకు ఎలాంటి నిజమైన ప్రయోజనాలు అందవు. ఉదాహరణకు ఇరిగేషన్ శాఖనే తీసుకుంటే.. ఏపీ జీవనాడి అయిన పోలవరం నిర్మాణానికి చాలా అడ్డంకులు ఎదుర్కొంటోంది. తెలంగాణలో నదీజలాలపై ప్రతీరోజు గొడవలున్నాయి. ప్రస్తుతం నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రెండేళ్లలో నీటిపారుదల శాఖపై మంచి పట్టు సాధించారు. ఇప్పుడు ఆయన స్తానంలో కొత్త వ్యక్తి మంత్రి అయితే నీటి పారుదలశాఖ సమస్యలపై అవగాహన చేసుకొని ఈ డిమాండ్లపై తక్షణమే స్పందించడం కష్టం. అసలు అవి అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది.
ఈ క్రమంలోనే జగన్ చేపట్టే మధ్యంతర మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం బూమరాంగ్ కావడం ఖాయమంటున్నారు. ప్రశాంత్ కిషోర్ చేప్పినట్టుగా చేస్తే జగన్ పుట్టి మునగడం ఖాయమంటున్నారు. అయితే పీకే టీం ఇప్పటికే సర్వం సిద్ధం చేసిందని.. సీనియర్ కే నీటి పారుదల శాఖ ఇచ్చి.. రాబోయే ఎన్నికల్లో కొత్త మంత్రులతోనే ఫలితం సాధించేందుకు రెడీ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది.