Indian Penal Code: బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు మోదీ సర్కార్ గుడ్‌బై చెప్పింది. త్వరలోనే భారతీయ చట్టాలు అందుబాటులోకి రానున్నాయి. శిక్షించడమే లక్ష్యంగా ఉన్న పాత చట్టాల స్థానంలో బాధితులకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యంగా భారతీయ చట్టాలు ఉంటాయని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. నేర సంబంధిత చట్టాల్లో సమూల మార్పు లక్ష్యంగా భారత శిక్షాస్మృతి(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు బిల్లులను కేంద్రం పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక మరో కీలకమైన రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడంతోపాటు మూక దాడులు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే గరిష్ఠంగా మరణశిక్ష పడేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు సంబంధించి మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. పరిశీలన కోసం వాటిని స్థాయీ సంఘానికి పంపించారు. బ్రిటిష్ చట్టాల స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టాల్లో ఉన్న కీలక ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
మూడు చట్టాలు.. 313 మార్పులు..
కొత్తగా తెచ్చే మూడు చట్టాలతో మొత్తంగా 313 మార్పులు తీసుకొచ్చారు.
– ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కేసు డైరీ వరకు.. ఛార్జ్ షీటు నుంచి తీర్పు వచ్చే వరకు.. ప్రక్రియ మొత్తం డిజిటల్ రూపంలోనే కొనసాగడం.
– సామూహిక అత్యాచారాల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు లేదా జీవితకాలం జైలుశిక్ష.
– మైనర్లపై జరిగే అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే మరణశిక్ష. – మూక దాడులకు పాల్పడితే ఏడేళ్ల జైలు. తీవ్రతను బట్టి జీవిత ఖైదు, మరణశిక్ష.
– చిన్నారులపై దాడులకు పాల్పడితే పదేళ్ల జైలు. జరిమానాలూ భారీగా పెంపు.
– గొలుసు దొంగతనాలను నేరాలుగా పరిగణించడం. పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ లేదా తన వ్యక్తిగతాన్ని దాచిపెట్టి మహిళపై లైంగిక దాడికి పాల్పడటం వంటివి నేరంగా పరిగణించడం.
నేరాల తీవ్రతను బట్టి, దోషిగా తేలిన వారికి శిక్షలో భాగంగా ‘సామాజిక సేవ’ చేయించటం.
కేసుల కాలయాపనకు అడ్డుకట్ట..
కేసుల విచారణలో కాలయాపన నివారణకు కూడా కేంద్రం చట్టాల్లో మార్పులు చేసింది. మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో సంక్షిప్త విచారణ చేయాలని నిర్ణయించింది. దీంతో సెషన్స్ కోర్టుల్లో 40శాతం కేసులు తగ్గిపోతాయని కేంద్రం అంచనా వేసింది.
– 2027 నాటికి దేశంలో ఉన్న కోర్టులన్నీ కంప్యూటరీకరణ. త్వరలోనే ఈ–ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు శ్రీకారం.
– యాక్సిడెంటు కేసుల్లోనూ ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా జీరో ఎఫ్‌ఐఆర్‌కు అవకాశం. 15 రోజుల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ.
– అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబానికి ఓ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రతి జిల్లాకు ఓ పోలీసు అధికారి. అరెస్ట్ అయిన వ్యక్తి బాధ్యత తమదేనని చెప్పడం ఈ సర్టిఫికెట్ ఉద్దేశం. దీన్ని వ్యక్తిగతంగా అందించడంతోపాటు, ఆన్‌లైన్ ద్వారా కూడా అందిస్తారు.
– లైంగిక హింస సంబంధిత కేసుల్లో బాధితుల స్టేట్‌మెంట్, వీడియో రికార్డింగ్ తప్పనిసరి. ఏదైనా కేసుకు సంబంధించి తాజా సమాచారాన్ని 90 రోజుల్లోగా అందజేయడం.
– బాధితుల వాదన వినకుండా ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసులను ఉపసంహరించుకునే అవకాశం ఏ ప్రభుత్వానికి ఉండదు. పౌరుల హక్కులకు ఇది రక్షణగా ఉంటుందని ప్రభుత్వం భావించింది.
– 90రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కోర్టు దీన్ని మరో 90 రోజుల వరకు గడువు పెంచవచ్చు. మొత్తంగా 180 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి విచారణ కోసం పంపించాలి.
– విచారణ తర్వాత 30 రోజుల్లోనే తీర్పు వచ్చేలా నిబంధన. అనంతరం వారంలో దాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
– సివిల్ సర్వెంట్లపై వచ్చే ఫిర్యాదులపై సదరు అధికారులు 120 రోజుల్లో అనుమతి ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని వెల్లడించాలి. ఎటువంటి స్పందన లేకుంటే దాన్ని అనుమతి ఇచ్చినట్లుగా భావిస్తారు.
– నేరస్థుడిగా తేలిన తర్వాత వారి ఆస్తుల నుంచి పరిహారం అందించేలా చట్టంలో మార్పు చేశారు.
– వ్యవస్థీకృత నేరాలు, అంతర్జాతీయ గ్యాంగులకు కఠిన శిక్షలు విధించడం.
రాజకీయ జోక్యం తగ్గింపు..
రాజకీయ జోక్యంతో ప్రభుత్వాలు శిక్షను తగ్గించే వాటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. మరణశిక్ష పడిన వారికి జీవిత ఖైదీగా.. జీవిత ఖైదీకి ఏడేళ్ల వరకు శిక్ష తగ్గించే వెసులుబాటు మాత్రమే కొత్త చట్టంలో కల్పించారు.
– ఉగ్రవాదానికి ఇప్పటివరకు నిర్వచనం లేదు. తొలిసారిగా ‘ఉగ్రవాది’కి నిర్వచనం కొత్త చట్టంలో కల్పించారు.
– నేరస్థులు పరారీలో ఉన్నప్పటికీ వారిపై విచారణ జరిపేందుకు అనుమతి కొత్త చట్టం ద్వారా కల్పించారు.
– వీడియోగ్రఫీ పూర్తయిన తర్వాత.. కేసు ముగిసేవరకు వాహనాన్ని స్వాధీనంలో ఉంచుకోవద్దు.
– ప్రతిఒక్కరూ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం పొందే వీలు కొత్త చట్టాలతో కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.
రాజద్రోహం రద్దు..
– ఇక అంత్యత కీలకమైన దేశద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. ‘ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది’ అని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తూ.. కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు చేశారు.
ప్రతీ జిల్లాలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు..
– ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ బృందం తప్పనిసరిగా పరిశీలించాలి.
– ప్రతీ ల్లాలో మూడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. తీర్పుల రేటును 90 శాతానికి తీసుకెళ్లడమే ఈ కొత్త చట్టాల లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.