India Today Cvoter Survey: కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు. ఎన్డీఏ కూటమిలో టిడిపి, నితీష్ కుమార్ పార్టీలు కీలకంగా ఉన్నాయి. వాస్తవానికి రెండు పర్యాయాలు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. మొదటిసారి భాగస్వామ్య పార్టీలతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండోసారి సింగల్ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది. మూడోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీటు రావడంతో టీడీపీ, నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ అవసరం ఏర్పడింది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ బిజెపికి కొన్ని రాష్ట్రాలలో కేక్ వాక్ లాంటి ఫలితాలు వస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ అధికారం దక్కడం లేదు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాలలో అధికారాన్ని దక్కించుకొని బిజెపి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ బిజెపి, నితీష్ కుమార్ పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నాయి. తద్వారా మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి, దాని అనుకూల పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, పరిపాలన సాగిస్తున్నాయి.
దేశంలో మెజారిటీ స్థానాల్లో ఉన్నప్పటికీ.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశం మీద ప్రఖ్యాత ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి షాక్ లాంటి ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో 352 స్థానాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బిజెపికి 41 శాతం అంటే దాదాపు 287 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 20% అంటే దాదాపు 80 సీట్లు వస్తాయని.. మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు, సీట్లు లభిస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది.
మనదేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమిలో ఎటువంటి లుకలుకలు కనిపించడం లేదు. నరేంద్ర మోడీకి కేంద్రంలో తిరుగులేదు. చంద్రబాబు, నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుంటున్నారు. బీహార్ లో నితీష్ కుమార్ కు బిజెపి సపోర్ట్ చేస్తుంది. బిజెపి సపోర్ట్ ద్వారానే ఆయన అక్కడ అధికారంలోకి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలంటే కచ్చితంగా కేంద్రంలో బిజెపికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఏపీలో కూడా జనసేన, టిడిపి, బిజెపి భాగస్వామ్య పక్షాలుగా పరిపాలన సాగిస్తున్నాయి. చంద్రబాబుకు అన్ని విధాలుగా అటు పవన్ కళ్యాణ్, ఇటు బిజెపి నేతలు సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రకారం కేంద్రంలో ఇప్పటికిప్పుడు నాయకత్వం మార్పు గాని.. ఎన్నికలు గాని జరిగే అవకాశం లేదు. కాకపోతే జనాల మూడ్ తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు ఇండియా టుడే లాంటి సంస్థలు సర్వే నిర్వహిస్తుంటాయి .. ఈ సర్వే కూడా అలాంటిదే. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇండియా టుడే ఇటువంటి సర్వేనే నిర్వహించింది. అప్పుడు కూడా బిజెపికి భారీగా సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టుడే అంచనా వేసిన విధంగా సీట్లు రాకపోయినప్పటికీ.. భాగస్వామ్య పక్షాలతో మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది