Mutton Prices Hike: గతంలో ఎప్పుడో పండుగలకు, పబ్బాలకు నీసు కూర తినేది. తర్వాత అది ప్రతి ఆదివారం కచ్చితంగా తేవాలనే మెనూ స్థాయికి వెళ్ళింది. కానీ ఇప్పుడు వారంలో మూడు సార్లయినా ముద్దలోకి ముక్క ఉండే స్థాయికి ఎదిగింది. అంతేకాదు గొర్రె, మేక మాంసానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఏకంగా కిలో 800 నుంచి 1000 రూపాయలకు చేరింది. ఆది, పండగ దినాల్లో అయితే 1000కి మించి పలుకుతోంది. మొన్న దసరా పండుగప్పుడు గొర్రె మాంసం సరిపోకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. కిలో మాంసం 1,200 చొప్పున విక్రయించారు. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా జనం ఎగబడి కొన్నారు.. ఫలితంగా దేశంలో అత్యధికంగా మాంసాహారం తినే ప్రజలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.. గత నాలుగు సంవత్సరాలలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగాయి.. దీనిని కిలోకు సగటున 600 గా లెక్కిస్తే 58,500 కోట్లు వెచ్చించినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లో గొర్రె, మేక మాంసం కిలో 600 నుంచి 700 రూపాయల లోపే లభిస్తుంటే.. తెలంగాణలో మాత్రం రిటైల్ మార్కెట్లో 1000 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రథమం
కోటి తొంబై లక్షలకు పైగా గొర్రెలతో తెలంగాణ ప్రథమ స్థానానికి చేరింది.. మాంసానికి పెరుగుతున్న విపరీతమైన డిమాండ్ కారణంగా నిత్యం 100 లారీల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు వస్తున్నట్టు వెల్లడైంది.. తెలంగాణ రాష్ట్రంలో 2015-16 లో గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులు. 2020-21 కల్లా అది 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది 3.50 లక్షల టన్నులకు పైగా విక్రయాలు ఉంటాయని, దీనికోసం ప్రజలు 31 వేల కోట్లకు పైగా డబ్బులను వెచ్చిస్తారని ఒక అంచనా. వచ్చే సంవత్సరం మాంసం మార్కెట్ విలువ 35వేల కోట్లకు సూచనలు కనిపిస్తున్నాయి. మనదేశంలో గొర్రె, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలు.. తెలంగాణలో అది 21.17 కిలోలకు చేరింది.. గొర్రెల పంపిణీ పథకం ద్వారా కొత్తగా 7, 920 కోట్ల సంపదను సృష్టించినట్టు ప్రభుత్వం చెబుతోంది.. ఇతర రాష్ట్రాల నుంచి కొని తీసుకొచ్చిన 82.74 లక్షల గొర్రెలను గొల్ల, కురుమలకు పంపిణీ చేయగా, వీటికి 1.32 కోట్ల పిల్లలు జన్మించాయి. వీటి ద్వారా ఏటా లక్షా 11 వేల టన్నుల మాంసం ఉత్పత్తి అదనంగా పెరిగింది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాంసం వ్యాపారులు ఆదివారం సంతల్లో ఇక్కడి నుంచి గొర్రెలు, మేకలను కొని తీసుకెళ్తున్నారు.
ఎందుకు ఈ వినియోగం
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆదాయ వ్యయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం చాలా ఇళ్లల్లో పెరిగింది. ప్రైవేట్ కంపెనీలు విస్తృతంగా ఏర్పాటు కావడం వల్ల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వెంటనే లభిస్తున్నాయి. దీంతో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పెరిగిన సంపాదనకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి.. ఇవే మాంసం వినియోగం పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ఇంట్లో వేడుక ఏదైనా, బయట జరిగే విందు, వినోదాలైనా మాంసం అనేది ఖచ్చితంగా ఉంటున్నది. కేవలం గొర్రె, మేకలు మాత్రమే కాకుండా కోళ్ల వినియోగం కూడా గరిష్ట స్థాయిలో ఉంటున్నది. తెలంగాణలో రొయ్యల పెంపకం అంతంత మాత్రమే కాబట్టి వాటి వినియోగం తక్కువ స్థాయిలో ఉంటున్నది. లేకుంటే అది కూడా గొర్రెలు, మేకల సరసన చేరేది.

ఆరోగ్యం జాగ్రత్త
మాంసం మితంగా తింటే మంచిదని, అది పరిమితి దాటితే ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి రకరకాల వ్యాధులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకు ఒకసారి మాంసం తింటే సరిపోతుందని, మాంసానికి బదులు తినే ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు..