
MLC Kavitha: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది..మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ లో వేగం పెంచారు. కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. అయితే ఇలాంటప్పుడు సహజంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు నాపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తుతారు. ఇప్పుడు కవిత కూడా అదే పల్లవి అందుకున్నారు. మరి ఇందులో ఆమెకు దక్కుతున్న ఫాయిదా ఎంత?

అవినీతి కేసుల వల్ల రాజకీయ నేతలు నష్టపోయిన కేసుల్లో బోఫోర్స్ కేసు ఒకటి. 1987లో స్వీడన్ రేడియో బోఫోర్స్ ఉత్పత్తిదారు.. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ముడుపులు చెల్లించారన్న విషయం వెల్లడించిన తర్వాత ఆ సమయంలో స్వీడన్‌లోనే ఉన్న హిందూ పత్రిక విలేకరి చిత్రా సుబ్రహ్మణ్యం పరిశోధ న చేసి మరిన్ని వివరాలు కూపీలాగి పత్రికలో ప్రచురించారు. ఇది కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో 1989ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. కాగా, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదైన పశుగ్రాసం కేసుతో రాజకీయంగా ఆయన చాలా నష్టపోయారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైన తర్వాత 1996లో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో జనతాదళ్‌లో తిరుగుబాటు చోటుచేసుకొని ఆయన ప్రత్యేక పార్టీ పెట్టాల్సివచ్చింది. ఎన్ని గిమ్మిక్కులు చేసినప్పటికీ 1998 తర్వా త ఆయన మళ్లీ సీఎం కాలేకపోయారు.
పాపం మాయావతి
యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2002లో తాజ్ కారిడార్, 2007-08లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెపై నమోదయ్యాయి. తర్వాత ఈ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ వాటి ప్రభావం ఆమె భవిష్యత్తుపై పడింది. 2012 తర్వాత ఆమె మళ్లీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇక 2004-14 మధ్య పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. 2జీ, కామన్వెల్త్, బొగ్గు తదితర కుంభకోణాల వల్ల అప్రతిష్ఠపాలైంది. అనేక మంది నేతలు, అధికారులు జైలుకు వెళ్లివచ్చారు. చివరకు ఈ కేసుల్లో ఏమీ తేలకపోయినా.. 2014లో యూపీఏ మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది.