Pamban Bridge : సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది.. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మన దేశంలో అయితే పురాతన కాలం నుంచే అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని నిర్మాణాలను వాటి నుంచే నేర్చుకుంటున్నారు. వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉన్న నిర్మాణాలు సైస్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే చేశారు. ఇక ఇప్పుడు టెక్నాలజీ సాయంతో కళ్లు చెదిరే నిర్మాణాలు చేస్తున్నారు. మన ఇంజినీర్లు కూడా తమ నైపుణ్యంలో ఔరా అనిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో షేర్ చేసిన న్యూ పంబన్ బ్రిడ్జి ఫొటోలు వావ్ అనిపిస్తున్నాయి. ప్రారంభానికి ఈ వంతెన సిద్ధమవుతోంది. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనను తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించారు. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీనిని నిర్మించారు. వంతెనకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా ఈ ఫొటోలు షేర్ చేశారు. ఈ బ్రిడ్జి ఒక అద్భుతమని కొనియాడారు.
105 ఏళ్ల క్రితమే వంతెన..
రామేశ్వరంలో 105 ఏళ్ల క్రితమే వంతెన నిర్మించారు. 1014లో నిర్మించిన పాత వంతెన రామేశరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. నాడు ఈ వంతెన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. 2.06 కి.మీ పొడవైన వంతెన 2006–2007లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌గా మార్చారు. ఇక ఈ బ్రిడ్జి మధ్య నుంచి షిప్పులు వెళ్లడానికి 16 మంది పనిచేయాల్సి వచ్చేది. అది తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్ బ్రడ్జిని ప్రభుత్వం నిర్మించింది. రెండు వంతెనల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కొత్త వంతెనను సరికొత్త టెక్నాలజీతో నిర్మించారు. కొత్త వంతెన పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా ఆధునిక సాంకేతికత జోడించారు. 2019లో ఈ పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
రూ.90 కోట్లతో కొత్త వంతెన..
పంబన్ కొత్త వంతెనకు రూ.90 కోట్లు ఖర్చు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేశారు. దీంతో పర్యాటకంగా వాణిజ్య పరంగా కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ వంతెన సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డబుల్ ట్రాక్‌లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు. హై స్పీడ్ రైలు కూడా వేగంగా వెళ్లేలా డిజైన్ చేశారు.
త్వరలో ప్రారంభం..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లండన్ బ్రిడ్జిని తలపించేలా నిర్మించిన పంబన్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వంతెన నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఐదేళ్లలో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేశారు. ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగానే దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. వంతెన ప్రారంభం తర్వాత రామేశ్వరానికి పర్యాటకులు పెరుగుతారని కేంద్రం భావిస్తోంది.