Ayodhya Ram`s Image : బుర్జ్ ఖలీఫాపై అయోధ్య రాముడు.. వైరల్‌ అవుతున్న ఫొటో.. వాస్తవం ఎంత?

దీంతో ఇది ఫేక్‌ అని ధ్రువీకరణ అయింది. 2023 ఏప్రిల్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అది కూడా ఫేక్ అని తేలింది.

Written By: Raj Shekar, Updated On : January 23, 2024 6:05 pm
Follow us on

Ayodhya Ram`s Image : అయోధ్య రామ మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకకు ఎనిమిది వేల మంది అతిథులను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష‍్ట క్రతువు నిర్వహించారు. బాల రాముడి దివ్యమైన రూపాన్ని దర్శించిన యావత్‌ దేశం పులకించిపోయింది. దేశమంతా పండుగలా రామాలయ ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. జై శ్రీరామ్‌ నామంతో భారత దేశం మార్మోగింది. ప్రత్యక్షంగా 8 వేల మంది వీక్షించగా, పరోక్షంగా కోట్లాది మంది రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను వీక్షించారు.  ఆన్‌లైన్‌లోనూ వేలాది మంది వీక్షించారు. అయితే ఇదే సమయంలో కొన్ని ఫేక్‌ ఫొటోలను కొంతమంది సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలు భారతీయులను ఆకర్షించినా, అందులో చాలా వరకు మార్ఫింగ్‌ ఫొటోలు కావడం గమనార్హం. ఇలాంటి ఫొటోల్లో ఒకటి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంపై శ్రీరాముని చిత్రం ప్రదర్శన కూడా ఉంది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో అత్యధికంగా వైరల్‌ అయింది. ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న లార్డ్ రామ్ ఋషి వేషంలో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిని భారతీయులు ఎక్కువగా షేర్‌ చేశారు.

తప్పుడు ఫొటోగా గుర్తింపు..
అయితే రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని 50 దేశాల్లో ప్రత్యక్షంగా వీక్షించారు. న్యూయార్క్‌ టైమ్స్ స్క్వై ర్‌పైనా ప్రదర్శించారు. అయితే బుర్జ్‌ ఖలీఫాపై ఎలాంటి ఫొటో ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ ఫొటోను చూసి చాలా మంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. కొందరు ఆ ఫొటో నిజమా అని ప్రశ్నించారు. “జై శ్రీ రామ్.. ఇది ఎడిట్ చేశారా లేదా నిజమా అని ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను?” అని ఒక వినియోగదారు కామెంట్‌ చేశాడు. ఇది ఫేక్‌ ఫొటో అని మరొకరు పేర్కొన్నారు. ఇది ఫొటోషాప్‌లో చేయలేదు. ఇది డిజిటల్‌ మార్ఫింగ్‌. మొత్తం ప్రపంచాన్ని పెయింట్‌ చేశారు అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.
ఫేక్‌ అని ధ్రువీకరణ.. 
ఇదిలా ఉంటే.. గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ బుర్జ్ ఖలీఫాను అదే కాంతిలో చూపిస్తుంది. కానీ దానిపై శ్రీరాముడి ప్రొజెక్షన్ లేకుండా ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్‌ ఖలీఫాకు గుర్తింపు ఉంది. ఏదైనా సందర్భాన్ని జరుపుకున్నప్పుడల్లా ఆ చిత్రాలను భవనం సోషల్‌ మీడియా ఖాతాలో ఫొటోలను షేర్‌ చేస్తారు. కానీ, రాముడి చిత్ర ప్రదర్శనకు సంబంధించి ఎలాంటి ఫోటోలు పోస్టు చేయలేదు. దీంతో ఇది ఫేక్‌ అని ధ్రువీకరణ అయింది. 2023 ఏప్రిల్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అది కూడా ఫేక్ అని తేలింది.