Homeఆంధ్రప్రదేశ్‌TDP Vs YCP : ఆ 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే..నష్టం టీడీపీకా..? వైసీపీకా..?

TDP Vs YCP : ఆ 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే..నష్టం టీడీపీకా..? వైసీపీకా..?

TDP Vs YCP : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు.. తెలుగుదేశం పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి చేరే ఆ నాయకులు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్న భావనను ఆ పార్టీ ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ నెంబర్ గేమ్ ఆ పార్టీకి మెలు చేస్తుందా..? తెలుగుదేశం పార్టీ కొంప ముంచబోతోందా..? అన్నది ఒకసారి చూసేద్దాం.

గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక ప్రకారమే మైండ్ గేమ్ ఆడుతోంది. వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బలంగా చెబుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా అనుకూలంగా ఓటు వేశారు. వీరితో కలుపుకుంటే మొత్తంగా 44 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చినట్లు అవుతుంది. ఇది ఆ పార్టీకి ఎంత వరకు లాభం చేస్తుందన్నదానికంటే.. నష్టాన్ని ఎక్కువగా చేకూర్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు వస్తాయని ఆశగా పనిచేస్తున్న నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న తాజా ప్రకటనలతో నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఆ పార్టీకి మరింత ఇబ్బంది కలిగించే పరిణామంగా మారనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

టిడిపి పోటీ చేసే స్థానాలు ఎన్నో..

రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే జనసేన పార్టీతో పొత్తు ఉంటే.. ఆ పార్టీకి 30 నుంచి 35 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపైన చర్చలు కూడా ముగిశాయి అనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చేందుకు సిద్ధమైన కమ్యూనిస్టు పార్టీలకు మరో 10 వరకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన చిన్నా, చితక పార్టీలకు ఒకటి రెండు సీట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇవి కాకుండా ఇప్పటికే వైసీపీలో అనధికారికంగా చేరిన రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురికి సీట్లు ఇవ్వాలి. ఇక టిడిపి నాయకులు చెబుతున్నట్లు మరో 40 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే వారికి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా వైసీపీ నుంచి వచ్చిన 44 మందికి, జనసేన కమ్యూనిస్టులు ఇతర పార్టీలు కలిపి మరో 45 మందికి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడుతుంది. సుమారుగా 90 స్థానాలు ఇక్కడే టిడిపి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగేళ్లుగా అధికార పార్టీపై పోరాటం సాగిస్తూ, పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ వస్తున్న మరో 86 మంది టిడిపి నాయకులకు మాత్రమే టికెట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది వేచి చూడాల్సిన అంశంగానే భావించాలి.

మైండ్ గేమ్ తో లాభం కంటే నష్టమే ఎక్కువ..

తెలుగుదేశం పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వస్టే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పని చేస్తున్న టిడిపి నాయకులు పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వైసీపీని టార్గెట్ చేసే లక్ష్యంతో టిడిపి ఆడుతున్న మైండ్ గేమ్ గా చెబుతున్నప్పటికీ.. ఒకవేళ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న భావన ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకుల్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. యాత్ర ప్రారంభమైన మొదటితో పోలిస్తే ఇప్పుడు కాస్త హుషారుగా సాగుతోంది. ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున జనాలను సమీకరించి పాదయాత్రకు తరలిస్తున్నారు. దీంతో యాత్ర మంచి ఊపు మీద సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఈ మైండ్ గేమ్ వల్ల భవిష్యత్తులో యాత్రకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న భావంతో ఉన్న టిడిపి నాయకులు పాదయాత్రను పట్టించుకునే అవకాశం ఉండదు. లక్షలు ఖర్చు చేసి జనాల్లోకి వెళ్లడం, పాదయాత్రకు వెచ్చించినా.. ఎన్నికల సమయానికి ఎవరో ఒక నాయకుడిని తీసుకువచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో చాలామంది టీడీపీ నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమైన అంశంగానే భావించాలి.

జనాల్లోకి వెళ్లని 35 మంది నాయకులు..

ఇకపోతే రాష్ట్రంలోని 35 పైగా నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలు జనాల్లోకి వెళ్లడం లేదన్న రిపోర్ట్లు తెలుగుదేశం పార్టీ అధినేత వద్దకు చేరాయి. ఇది కూడా కొంత ఇబ్బందికరమైన అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను అప్రమత్తం చేసి జనాల్లోకి వెళ్లేలా చేయాల్సిన అవసరం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉంది. పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. అంతేగాని పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చి టికెట్లు ఇవ్వడం వలన ఉపయోగం ఉండదు అన్నది పలువురి మాట. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నెంబర్ గేమ్ తో ఆ పార్టీకి ఇబ్బంది తప్ప అధికార పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు అన్నది రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తున్న మాట. వైసీపీ నుంచి వచ్చే నాయకులు కోసం తాము ఎందుకు పనిచేయాలని కేడర్ భావించిన సమస్య మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది.

వద్దనుకున్న ఎమ్మెల్యేలను తెస్తే ఫలితం ఉంటుందా..?

తెలుగుదేశం పార్టీ అధికారాల్లో ఉన్న వైసీపీని బలహీనం చేస్తున్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే.. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లడం వలన మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. వైసీపీలో ఉన్న ఆయా ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్న ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. వైసిపి వద్దనుకుంటున్న ఎమ్మెల్యేలను ఏరుకోరి తెచ్చుకోవడం వలన టిడిపికి లాభం ఏమిటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రజల్లో వారికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే వైసిపి వారికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అటువంటి వారిని తెచ్చి టికెట్లు ఇవ్వడం వలన ఎటువంటి ఫలితం ఉంటుందో అన్నది తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.

Exit mobile version