ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిన.. ఆ తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఏపీలో కొత్త నినాదం కూడా అందుకున్నారు. కానీ.. ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో.. ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అయితే.. కాలక్రమంలో గాయాలు మానడం సహజం. మాన్పుకోవడానికి మనవంతుగా ప్రయత్నం చేయాలి. కానీ.. నల్లారి అలాంటి ప్రయత్నాలేవీ చేస్తున్నట్టు కనిపించట్లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ.. కిరణ్ కుమార్ రెడ్డి లైన్లోకి రాలేదు. తాజాగా.. తిరుపతిలో ఉప ఎన్నిక వేళ ఆయన పేరు తెరపైకి వచ్చింది.
కారణం ఏమంటే.. అది ఆయన సొంత జిల్లా. తిరుపతిలో నల్లారికి అంతో ఇంతో బలంగా కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ తరపున చింతా మోహన్ బరిలోకి దిగారు. ఆయన గతంలో పలుమార్లు తిరుపతి నుంచి గెలిచారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేసి ఉంటే.. కాంగ్రెస్ గెలవకున్నా.. ఆ జోష్ మరోవిధంగా ఉండేదని అంటున్నారు. ఓట్లు కూడా మరిన్ని పెరిగేవని చెబుతున్నారు. కానీ.. ఆయన మాత్రం బయటకు రాలేదు.
అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప, ఈ మాజీ సీఎం బయటకు రారట! ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితం అయిన నల్లారి.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా రాజకీయం మామూలేనని చెప్పుకుంటున్నారు జనం.