Ichamati River: నది నాగరికతకు నిదర్శనం. అందుకే సింధు నది పేరు చెబితే హరప్పా సంస్కృతి గుర్తుకు వస్తుంది. నైలు నది పేరు చెప్తే ఈజిప్ట్ జ్ఞప్తిలోకి వచ్చేస్తుంది. నది అంటే నీళ్లు మాత్రమే కాదు.. సంస్కృతికి, పచ్చని పంటలకు, ఆ పంటలపై బతికే లక్షల గొంతుకులకు బతుకుతెరువులు.. అలాంటి గొప్ప నదులు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. ఆ నదుల ఆధారంగా.. వాటి ప్రవాహం ఆధారంగా లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. కానీ అలాంటి నదుల్లో.. ఒక నది క్రమక్రమంగా మాయమవుతోంది. దాని ఆధారంగా సాగే వ్యవసాయం మూలన పడుతోంది. 30 లక్షల మందికి బతుకుతెరువు కరువవుతోంది. ఇంతకీ ఏమిటి ఆ నది? ఎక్కడుంది? ఎందుకు దాన్ని అక్కడ ప్రజలు జీవన్మరణ సమస్యగా చూస్తున్నారు.
బెంగాల్ రాష్ట్రంలో ఇచ్చామతి పేరుతో ఒక నది ఉంది. ఇది 288 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ నది పరిధిలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నది ఆధారంగా 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ నది పశ్చిమ బెంగాల్ తో పాటు.. బంగ్లాదేశ్ లోనూ ప్రవహిస్తుంది. ఈ నది ప్రవహిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రానా ఘాట్, బంగావ్, బసిర్హాట్, బరాసత్ పార్లమెంట్ నియోజకవర్గం జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నది రోజురోజుకు క్షీణిస్తుండడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, రైతులు తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నది పరిరక్షణ కోసం ఇప్పటికే 14 సంఘాలు “నదియా నది సంసద్” అనే పేరుతో ఒక సంస్థగా ఏర్పాటయ్యారు. నదియా నది సంసద్ ఆధ్వర్యంలో ఇచ్చామతి నది పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు.
ఇచ్చామతి నదికి 33 ఉపనదులు ఉన్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం 10 ఉపనదుల నుంచే ఇచ్చామతికి ప్రవాహం వస్తోంది. పారిశ్రామికీకరణ, ప్లాస్టిక్ వినియోగం పెరగడం, వర్షాలు సరిగ్గా లేకపోవడం, ఎక్కడికి అక్కడ వ్యర్ధాలు పేరుకుపోవడంతో ఉపనదులు దాదాపుగా మాయమైపోయాయి. ఇచ్చామతి నదికి ఉపనదుల నుంచి ప్రవాహాలు లేకపోవడంతో అది జవసత్వాన్ని కోల్పోయింది. ఉత్తుంగ తరంగం లాగా ప్రవహించిన ఆ నది.. ఇప్పుడు పిల్ల కాలువను తలపిస్తుండడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇచ్చామతి నది పునరుద్ధరణ కోసం నదియా నది సంసద్ ఆధ్వర్యంలో ఎప్పటినుంచో పోరాటాలు జరుగుతున్నాయి. వారి పోరాటాలు గుర్తించిన రాజకీయ పార్టీలు.. తమ మనుగడ కోసం వినియోగించుకున్నారు తప్ప.. ఆ నదిని బాగు చేసిన పాపాన పోలేదు. దీంతో వారే రంగంలోకి దిగి ఇచ్చామతి సంరక్షణ కోసం 140 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. సబర్నా గ్రామానికి చెందిన ప్రజలు ఇచ్చామతి నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను, ఇతర కలుషితాలను శుద్ధి చేశారు. అయితే ఈ నదికి ఉన్న మిగతా ఉప నదులలోనూ ఇలానే సంరక్షణ చర్యలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీనిపై ఇంతవరకు రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం విశేషం.
ఇచ్చామతి నది పరిధిలో ఒకప్పుడు చేపలు విస్తారంగా ఉండేవి. కాల క్రమంలో పారిశ్రామిక వ్యర్ధాలు నదిలోకి రావడంతో నత్రజని, బాస్వరం స్థాయి పెరిగింది. ఫలితంగా నీటిలో విపరీతంగా తూటి కాడ విస్తరించింది. అందువల్ల అందులో జలచరాలకు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. దీంతో రోజురోజుకు చేపలు చనిపోవడం ప్రారంభమైంది. ఫలితంగా ఈ ప్రాంత మత్స్యకార వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను దిగుమతి చేసుకొని వ్యాపారం చేస్తున్నారు.. ఇక ఇచ్ఛామతి వరద మైదానంలో 30,000 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసేవారు. 40 వేల మంది మత్స్యకారులు ఈ వరద మైదానంపై ఆధారపడి ఉండేవారు. నీరు సరిగా రాకపోవడంతో ఈ 30 వేల ఎకరాలు బీడు పడింది. 40 వేల మంది మత్స్యకారులకు ఉపాధి కరువైంది.
ఇచ్చామతి నది తీరంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు ఏర్పాటయ్యాయి.. ఇవి నదికి తీవ్రస్థాయిలో కాలుష్యాన్ని చేస్తున్నాయి. పరిశ్రమలు, ఇతర వ్యర్ధాల వల్ల ఇచ్చామతిలో ఉప్పునీరు ప్రవేశిస్తోంది. దీనివల్ల ఆ నీరు తాగడానికి ఉపయోగపడటం లేదు. చివరికి సాగునీటికి యోగ్యంగా ఉండడం లేదు. అన్నింటికీ మించి ఈ నది పరిధిలో చట్ట విరుద్ధంగా చెక్ డ్యాం లు నిర్మించారు. దీంతో నదిలోకి ఇతర ఉపనదుల ప్రవాహం దారుణంగా తగ్గిపోయింది. అయితే ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఈ నది పునరుద్ధరణ కోసం హడావిడిగా ప్రకటన చేసింది. అయితే ఇది ఎంతవరకు అమలవుతుందనేది అక్కడి ప్రజల ప్రశ్న. మరోవైపు నదీ పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉన్న పార్టీకే తాము జై కొడతామని నది నదియా సంసద్ సభ్యులు చెప్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ichhamati river interesting facts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com