MP Kesineni Nani: తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు తలనొప్పుల తెచ్చే నాయకుల్లో కేశినేని నాని ఒకరు. రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన తరువాత చాలా సందర్భాల్లో నాని పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేశారు. పార్టీకి విధేయత చూపుతూనే స్వతంత్రంగా వ్యవహరించాలనుకునే క్రమంలో చంద్రబాబును సైతం ఇబ్బందిపెట్టిన సందర్భాలున్నాయి. ఒకానొక దశలో ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగినా..అటువంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం నానికి విజయవాడ పార్లమెంటరీ పరిధిలో మిగతా టీడీపీ నాయకులతో పొసగడం లేదు. సొంత కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత లేదు. ఈ క్రమంలో నాని చేస్తున్న కామెంట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఆయన విజయవాడ పార్లమెంటరీ పరిధిలో టీడీపీ నాయకులపై చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీ సర్కిల్ లో చర్చకు దారితీశాయి.

మొన్న ఆ మధ్యన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే సమయంలో కూడా నాని వ్యవహార శైలి కొద్దిపాటి చర్చకు దారితీసింది. ఆ సమయంలో ఎంపీల బృందంలో నాని ఉన్నా అంతగా యాక్టివ్ గా కనిపించలేదు. చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. అందుకు నాని తమ్ముడు శివనాథ్ కారణమని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. తరువాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు అదే శివనాథ్ పేరును ప్రస్తావిస్తూ నాని కామెంట్స్ చేశారు. శివనాథ్ కు టిక్కెట్ ఇస్తే మాత్రం తాను సహకరించనని తెగేసి చెప్పేశారు. గత ఎన్నికల్లో సోదరుడు నాని గెలుపు కోసం శివనాథ్ కృష్టిచేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో సైతం కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొద్దిరోజులుగా సోదరులిద్దరి మధ్య పొసగడం లేదు. కానీ తన గెలుపు కోసం కృషిచేసిన సోదరుడు శివనాథ్ విషయంలో నాని హాట్ కామెంట్స్ చేయడం విజయవాడ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచింది.
టీడీపీ అంతర్గత వ్యవహారంపై నాని బాహటంగానే మాట్లాడేశారు. ఆ ముగ్గురు నాయకులకు టిక్కెట్లు ఇస్తే పనిచేయలేనని తేల్చిచెప్పారు. అయితే నాని ఇప్పటివరకూ అలకబూనినా.. అసంతృప్తి వ్యక్తం చేసినా పెద్దగా వైరల్ కాలేదు. కానీ ఇప్పుడు తన సోదరుడితో పాటు మరో ఇద్దరు నేతలు పోటీచేస్తే మాత్రం సహకరించనని చెప్పడంపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ధిక్కార స్వరాలను ఆదిలోనే చెక్ చెప్పాల్సిన అవసరముంది. అయితే నాని విషయంలో చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నారు. తోటి టీడీపీ నాయకులతో ఆయనకు పొసగకపోవడంతో ఎంపీ నుంచి తప్పించి ఆయన కుమార్తె సౌమ్యను ఏదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు టచ్ లో ఉన్నారని ..ఆయన ఎంపీగా పోటీచేయడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తండ్రి కేశినేని నానితో సమావేశమయ్యారు. వైసీపీ ధిక్కార ఎమ్మెల్యేల జాబితాలో వసంతకృష్ణప్రసాద్ ఉన్నారు. దీంతో ఆయన్ను టీడీపీలో చేర్చుకునేందుకు నాని పావులు కదుపుతున్నారన్నటాక్ వినిపించింది. అటు నాని సైతం వసంతకృష్ణప్రసాద్ విషయంలో వైసీపీ ప్రభుత్వ చర్యలను ఖండించారు. దీంతో వసంతకృష్ణప్రసాద్ ను టీడీపీలో రప్పించేందుకు నాని యాక్టివ్ గా పనిచేస్తున్నారన్న ప్రచారం సాగింది. అయితే ఇంతలోనే సొంత సోదరుడితో పాటు మిగతా నాయకులపై ఓపెన్ గా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.