Huzurabad Congress: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎన్నిక బరిలో యువకిశోరాన్ని దింపింది.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడినే ఎంపిక చేసింది. ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు పరిశీలించినా చివరకు యువనేతకే పట్టం కట్టింది.

గత హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 61 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బదులిచ్చి నైతిక విజయం తమదేనని ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఓట్ల కోసం పాట్లు పడాల్సి వస్తోందని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ ను ఢీకొనాలంటే ఆయనకు సమ ఉజ్జీ అయిన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఓట్లు రాబట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు. నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం నేతను బరిలోకి దింపేందుకు ఆలోచిస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎట్టకేలకు ఖరారు చేశారు. అధికార పార్టీ, బీజేపీని ఎదుర్కొనే సత్తా గల నేత కోసం గాలించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో బరిలో నిలవబోయే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్.యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ శనివారం అధికారికంగా ప్రకటించింది. యువనేతకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థి ప్రకటనతోనే పార్టీ ప్రచారం కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.