Huzurabad By Elections: ఎన్నికల పండుగ అనగానే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది ఎన్నికల సిత్రాలు.. ఓ అభ్యర్థి ఓటర్ల పిల్లల ముడ్డి కడిగేస్తుంటారు.. మరో అభ్యర్థి హోటల్స్ కెళ్లి బజ్జీలు వేస్తుంటాడు. మరికొందరైతే ఆడవారి ఇంటిలోకి వెళ్లి బట్టలు కూడా ఉతికేస్తుంటారు. ఓట్ల కోసం పిల్లాడు ముక్కు చీమిడి కూడా తీసేస్తుంటారు. అలాంటి సిత్రవిచిత్రమైన ఎన్నికల నగారాకు దూరంగా అధికార టీఆర్ఎస్ ఇప్పుడు ‘పథకాలు, డబ్బులు ఇస్తాం.. ఓట్లు వేస్తారా? చస్తారా?’ అని బెదిరించే పరిస్థితికి వచ్చిందట.. పనులు కావాలంటే.. మీకు పథకాలు అందాలంటే ఓటు వేయకతప్పదు అని బెదిరించే స్థాయికి వచ్చేసిందట..
Huzurabad By Elections TRS
తెలంగాణలో ఇదో నయా రాజకీయం.. అధికార టీఆర్ఎస్ ప్రజలను ఓట్లు అడగడం మానేసి దబాయిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను తీసుకున్న మంత్రి హరీష్ రావు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈటలకు ఓట్లు వేస్తే మీకు ఏం ఉపయోగం ఉండదని.. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ‘మాడిపోతారు’ అన్నట్టుగా ఒకరకమైన బెదిరింపు ధోరణితో ముందుకెళుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేకాదు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్లు ఇల్లు కట్టిస్తామని.. అది తమను గెలిపిస్తేనే అంటూ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేయడం గమనార్హం. ‘‘టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే హజూరాబాద్ లో 5 వేల ఇళ్లు కడతాం. 57 ఏళ్లకే పెన్షన్ ఇప్పిస్తాం.. 50 వేల నుంచి లక్ష లోపు రైతు రుణాలు మాఫీ… 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. స్వంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూ .సాయం చేస్తాం. రాజేందర్ గారు.. మీరు గెలిస్తే హుజూరాబాద్ కు ఎం చేస్తారు? సిలిండర్ ధర 500 రు. కు తగ్గిస్తారా….? మీ బీజేపీ పార్టీ ఏం చేస్తది..? అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇక అంతటితో ఆగకుండా ఓటర్లను బెదిరించేలా హరీష్ రావు డైరెక్ట్ యాటాక్ చేయడం సంచలనమైంది. మమ్మల్ని గెలిపించకపోతే మీ బతుకులు ఆగమవుతాయని ప్రజలను హరీష్ రావు బెదిరించిన వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘‘ఇది నడుమంతర ఎన్నికలు. రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆర్థిక మంత్రిగా నేను ఉంటాను. 30 ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎంగారి ప్రేమ ఉండాలి. ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ ఢిల్లీలో ఉంది. టీర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంది. బీజేపీ ధరలు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ సంపదను పెంచి పేదలకు పంచింది. బీజేపీ రైతులకు ఏం చేయలేదు. పేదలకు చేయలేదు. పెద్దలకు చేసిండ్రు. కేసీఆర్ 2016 రూ పెన్షన్ పెదలకు ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష నూట పదహార్లు సాయం చేసిండు. రైతులకు యాసంగి, వానాకాలం పంటకు కలిపి ఎకరానికి పది వేలు ఇచ్చింది కేసీఆర్. ఏది ఇచ్చినా రైతు బందు, దళిత బందు ఇచ్చినా.. అది కేసీఆర్ మాత్రమే ఇస్తడు.’’ అంటూ ఓటర్లకు ఓ రకమైన హెచ్చరికలను చేసిన పరిస్థితి నెలకొంది.
టీఆర్ఎస్ రాజకీయం చూస్తే.. ఓటర్లను బతిమిలాడాల్సింది పోయి బెదిరిస్తున్న తీరు కనిపిస్తోంది. అధికారంలో ఉండడంతో ఇప్పుడు టీఆర్ఎస్ బెదిరించొచ్చు. ఓటర్లు భయపడి ఓటు వేయవచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే ఓటర్లు కర్రు కాల్చి వాతపెడుతారు. ఏ నాయకుడు అయినా ఏ పార్టీ అయినా కూడా ఓటర్లను ఓట్లు అడుక్కోవాలి.. కానీ టీఆర్ఎస్ మాత్రం ఈ తీరుగా రాజకీయం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ ఎదుర్కోలేకపోతోంది. ఆయన పరపతి ముందు టీఆర్ఎస్ ఎన్ని కోట్లు కురిపించి పథకాలు, లబ్ధి చేకూర్చినా కూడా ఓటర్లలో మార్పు అయితే రావడం లేదని తెలుస్తోంది. ఇన్నాళ్లు వరాలు కురిపించిన టీఆర్ఎస్ .. క్షేత్రస్థాయిలో ఓటర్ల మదిని దోచుకోకపోవడంతో ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బెదిరింపులకు ఓటర్లు భయపడుతారా? టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారా? కర్రు కాల్చి వాతపెడుతారా? అన్నది వేచిచూడాలి.