Huzurabad By Elections: మరో వారం రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. కేసీఆర్ ను ఎదురించి.. ఆ పార్టీకి రాజీనామా చేసి తొడగొట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవితవ్యం ఏంటనేది తేలనుంది. తనను ఎదురించిన ఏ నేతను రాజకీయాల్లో ఎదగనీయని సీఎం కేసీఆర్ అంతే పట్టుదలగా తన మందీమాగధులను హుజూరాబాద్ లో దించి ఈటలను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. హుజూరాబాద్ పై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పథకాల వర్షం కురిపించారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ ఇప్పుడడు నియోజకవర్గంలో అన్ని రకాల మైండ్ గేమ్ లు ఆడుతోంది.
ఇప్పటికే ఈటలను ఓడించడానికి నామినేషన్లతోనే టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. టీఆర్ఎస్ నాయకులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి ముందే ‘ఈటల’ను దెబ్బ కొట్టింది. ఈటల రాజేందర్ పేరుతో ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు వేసినట్టు బీజేపీ ఆరోపించింది. ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన తర్వాత వారి నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళితబంధు’ను ఈసీకి ఫిర్యాదు చేసి ఆపుచేయించారు. ఎన్నికలు జరిగే వరకూ ఈ పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ లేఖ రాసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దళితబంధును బంద్ చేసిన పాపం బీజేపీపై నెట్టింది. ఈ పథకం హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి దోహదపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఇక తాజాగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి బీజేపీ ఏకంగా తన ప్రత్యర్థి కాంగ్రెస్ తో చేతులు కలిపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో కాంగ్రెస్-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి. వారు దానిని ఖండించనివ్వండి.. ఈటల, రేవంత్ రెడ్డి గోల్కొండ రిసార్ట్ లో రహస్యంగా భేటి అయ్యారని బాంబు పేల్చారు. నా దగ్గర ఆధారాలున్నాయని కూడా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా ఈటలకు ఓటు వేయాలని ప్రజలకు బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. దీంతో కాంగ్రెస్-బీజేపీ బంధం మరోసారి బయటపడినట్టైంది.
ఇటీవలే కాంగ్రెస్ నుంచి వైదొలిగిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి పార్టీ చాలా ప్రాధాన్యమిస్తుందని ఆరోపించిన విషయం కూడా కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే దీన్ని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అందిపుచ్చుకొని హుజూరాబాద్ లో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ ను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో వేచిచూడాలి.