Bharat: భారత్ రాజధాని ఢిల్లీలో శనివారం (సెప్టెంబర్ 9) నుంచి జీ20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో దేశం పేరును మార్చనున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే దీనిపై అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 75 ఏళ్ల తర్వాత పేరు మార్పు అవసరమా అని కొందరు.. మారిస్తే తప్పేంటని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఇప్పటికే దేశంలో అనేక నగరాల పేర్లు మార్చారు. ఈ నేపథ్యంలో దేశం పేరు మార్చిడం తప్పు కాదనే వాదనే ఎక్కువగా వినబడుతోంది.
అంత చిన్న విషయం కాదు..
ఒక వ్యక్తి పేరు మార్చడానికి సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించి.. అభ్యంతరాలు స్వీకరించి.. ఎలాంటి అభ్యంతరం రాని పక్షంలో పేరు మారుస్తారు. అలాంటిది ఒక దేశం పేరు మార్చడమంటే చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు ఇండియా నుంచి భారత్ పేరు మార్చడానికి అనేక అంశాల మార్పుతోపాటు అందుకు ఖర్చు కూడా రూ.14,304 కోట్లు ఖర్చు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది దేశంలో పేదలకు ఆహార భద్రత పథకం కింద ఇచ్చే బియ్యం ఖర్చుతో సమానం.
ఎందుకంత ఖర్చంటే..
దేశం పేరు ఇండియా నుంచి భారత్‌గా మార్చితే.. ఇప్పటికే అమలులో ఉన్న అనేక పత్రాలు, పాస్ పోర్టులు, గుర్తింపు కార్డులు, వెబ్‌సైట్లు, అధికారుల హోదాలు, నేమ్ ప్లేట్లు బోర్డులు, చివరకు కరెన్సీపై కూడా దేశం పేరు మార్చాల్సి ఉంటుంది. వార్డు స్థాయి నుంచి మార్పు మొదలవ్వాలి. ఈ మార్పులు రావడానికి ఖర్చుతోపాటు సమయం కూడా ఎక్కువే పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సమన్వయం కూడా కావాలి.
ఇప్పటికే నగరాల పేర్లు మార్పు..
ఇప్పటికే కేంద్రం దేశంలోని అనేక నగరాల పేర్లు మార్చింది. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, గుర్గావ్‌ను గురుగ్రామ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంబాజీ నగర్‌గా ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చరు. త్వరలో లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం 2018లో అలాబాద్ పేరు మార్చడం వలన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఖర్చయిందట. ఈమేరకు గతంలో ఇండియా టుడే కథనం రాసింది.
దేశం పేరు మార్చాలంటే..
దేశంలో ఒక నగరం పేరు మార్చడానికే రూ.300 కోట్లు ఖర్చు పెడితే.. ఇక దేశం పేరు మార్చాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. దేశం అధికారిక పేరు మార్చడం ఇదే మొదటి సారి కూడా కాదు. పరిపాలనా సామర్థ్యం మెరుగు పర్చడానికి వలస రాజ్యాల మూలాలను సమూలంగా తొలగించేందుకు, ప్రభుత్వంలో మార్పు తీసుకురావడం కోసం ఇంతకు ముందు కొన్ని దేశాలు పేరు మార్చుకున్నాయి.
– మన పొరుగు దేశమైన శ్రీలంక పేరును 1979లో మారింది. అప్పటి వరకు సిలోన్‌గా ఉన్న పేరును శ్రీలంకగా మార్చారు. అయితే శ్రీలంక పేరు మారిన తర్వాత కూడా దాదాపు 2000 సంవత్సరం వరకు చాలా మంది సిలోన్‌గానే పిలిచారు.
– ఇక 2018లో దక్షిణాఫ్రికా దేశమైన స్వాజిలాండ్ పేరును ఎస్వతినిగా మార్చరు. ఆ సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన డారెన్ అలీవర్ అనే న్యాయవాది దేశం పేరు మార్చడానికి అయ్యే ఖర్చును లెక్కించడానికి ఒక పద్ధతిని కనుగొన్నారు. దేశం పేరు మార్పును డారెన్ అలీవర్ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని రీబ్రాండింగ్ చేయడంతో పోల్చారు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ దాని మొత్తం ఆదాయంలో 6 శాతం మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తుంది. ఒక మార్కెటింగ్ బడ్జెట్‌లో 10 శాతాన్ని రీబ్రాండింగ్ కోసం ఖర్చు చేస్తారు. అలీవర్ అంచనాల ప్రకారం స్వాజిలాండ్ పేరును ఎస్వతినిగా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయింది.
గత ఆర్థిక సంవత్సరం మన దేశ ఆదాయం..
ఇక మన దేశం విషయానికి వచ్చే సరికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ట్యాక్స్, నాన్ టాక్స్ రెవెన్యూ మొత్తం కలిసి రూ.23.84 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. దేశం పేరు మార్చడానికి అలీవర్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే ఫార్ములాను భారత దేశానికి వర్తింపజేస్తే ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి రూ.14,304 కోట్లు ఖర్చవుతుంది. ఇది 80 కోట్ల మంది పేదలకు కేంద్రం ఒక నెల అందించే బియ్యం ఖర్చుతో సమానం.