AP High Court- Jagan: దున్నపోతు మీద వానపడితే ఏం చేస్తుంది.. దులుపుకొని పోతుంది…. జగన్ సర్కార్ కూడా అచ్చం అంతే.. హైకోర్టు ఎంత గొంతు చించుకుంటే ఏం లాభం.. ఎన్నిసార్లు చెప్పినా.. జగన్ తనకు నచ్చిందే చేస్తాడు. తాను చేసిందే చట్టం.. ఇచ్చిందే ఆర్డర్ అన్నట్టుగా వెళుతున్నారు. హైకోర్టుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తీరుగా ముందుకెళుతున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు గట్టి షాక్ తగలడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.

గతంలో కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. ముచ్చెమటలు పట్టేవి. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే బాధ్యత వహించేవి. మరింత బాధ్యతగా వ్యవహరించేవి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ప్రతిరోజూ అక్షింతలు తప్పడం లేదు. నిత్యం ఎంతో మంది ప్రభుత్వ బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అటు కోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తుందంటూ మరికొందరు పిటీషన్లు వేస్తున్నారు. కానీ ఇదో సర్వసాధారణ అంశంగా ప్రభుత్వం చూస్తోంది. తప్ప తమ చర్యలను న్యాయస్థానం తప్పుపడుతుందన్న భావన, పశ్చాత్తాపం ప్రభుత్వంలో అస్సలు కనిపించడం లేదు.
సలహాదారుల భర్తీ నుంచి ప్రతి అంశాన్ని తప్పుపడుతూ కోర్టు వాతలు పెడుతోంది. నిన్నటికి నిన్న చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ బంధువుల ఇంట్లో దొంగతనానికి పాల్పడాల్సి వచ్చింది. కోర్టు కూడా ఈ ఘటనను ప్రస్తావించింది. జీవిత చరమాంకంలో ఉన్నపెన్షనర్లను పిక్ పాకెటర్లుగా మారుస్తారా? అంటూ కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఏ ప్రభుత్వమైన ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుందంటే నైతికంగా పతనం అంచున నిలబడిందనే భావించవచ్చు. అయితే ఇటువంటి అనైతిక చర్యలకు అలవాటు పడిపోయిన ఏపీ సర్కారు.. కోర్టు తమను ప్రశ్నించడం ఏమిటి? అన్న సరికొత్త వాదన తెచ్చి తన చర్యలను సమర్థించుకుంటోంది.

ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై కూడా హైకోర్టు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టింది. కానీ దానికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కానీ.. ఇప్పటివరకూ జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలకు ప్రత్యేకపథకాలు కానీ.. రాయితీలు కానీ లేవు. అందరికీ ఇచ్చినట్టే నవరత్నాల్లోపథకాలు ముట్టజెప్పి.. వాటినే ఎస్సీ కార్పొరేషన్ ద్వారాఅందిస్తున్నట్టు లెక్కకడుతున్నారు. అవే ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించినట్టుగా చూపుతున్నారు. దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారు. జగన్ విజయానికి సంపూర్ణ కారకులు దళితులే. వైసీపీని ఓన్ చేసుకున్న వారు వారే. అయినా వారి పట్ల జగన్ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాలు అందించే పథకాలు, రాయితీలకు ఫుల్ స్టాప్ పెట్టి నవరత్నాల ద్వారా ఎవరూచేయని.. చేయలేని విధంగా దగా చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ బాధితులకు ప్రతిపక్షాలు న్యాయం చేయలేకపోతున్నాయి. వారు గొంతెత్తినా పట్టించుకోవడం లేదు. కానీ న్యాయస్థానాలు మాత్రం బాధితుల పక్షాన నిలుస్తున్నాయి. వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపెడుతున్నాయి. వారికి న్యాయం చేయాలని ఆదేశాలిస్తున్నాయి. పాలనా వ్యవస్థలో జ్యుడీషియల్ పెత్తనం ఏంటని వాదించే పాలకులు మాత్రం ఆ ఆదేశాలను అమలుచేయడానికి ఇష్టపడడం లేదు. కోర్టు ధిక్కరణకే మొగ్గుచూపుతున్నారు. నిజంగా ప్రభుత్వమే తప్పిదాలను గుర్తెరిగి మసులుకుంటే ఒక్కరంటే ఒక్కరు న్యాయస్థానం వైపు చూడరు. కోర్టు కూడా అదే కోరుతోంది. ప్రభుత్వం న్యాయం చేస్తే బాధితులు మావద్దకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తోంది. కానీ న్యాయస్థానాల వాదన, ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోలేని వింత పోకడలు, వ్యవస్థలపై దాడి ఏపీలోనే జరుగుతుండడం మన దురదృష్టకరం. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పాలకులు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ఆ సిగ్గుపడకపోగా.. తిరిగి న్యాయవ్యవస్థకే ఎదురెళ్లుతుండడం జుగుప్సాకర రాజకీయానికి సంకేతం.