Green Crackers: మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ.. దీపావళి పండుగ అంటేనే లక్ష్మి పూజ చేసుకోవడం.. బాణసంచా కాల్చడం.. మిఠాయిలు పంచుకోవడం.. ఒకప్పుడు బాణసంచా ఈ స్థాయిలో కాల్చేవారు కాదు. ఫ్యాక్టరీలు కూడా ఈ స్థాయిలో ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాణాసంచా అధికంగా కాల్చడం కొన్ని సంవత్సరాలుగా జరిగిపోతోంది. బాణాసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు తప్పు పడితే.. దీనిని మతంతో ముడి పెడుతున్నారు. దీంతో ఈసారి ఢిల్లీ లాంటి నగరాలలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లాంటి నగరాలలో కాలుష్యం విపరీతంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే అక్కడ విపరీతమైన కాలుష్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక శీతకాలం లో అయితే అక్కడ కాలుష్యం తారస్థాయికి చేరుతుంది. శీతకాలంలోనే దీపావళి పండుగ వస్తుంది కాబట్టి.. ఆ కాలుష్యానికి బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యం తోడు కావడంతో తీవ్రత మరింత పెరుగుతుంది. అందువల్లే పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు తమ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటారు.
సుప్రీంకోర్టు ఈసారి గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని చెప్పింది.. అందులో కూడా క్యూ ఆర్ స్కాన్ ఉన్నవాటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించింది. గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఓవర్గం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ వల్ల పొల్యూషన్ తగ్గుతుందని చాలామంది అంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
పొల్యూషన్ తగ్గించడానికి వాడే గ్రీన్ క్రాకర్స్ కూడా పూర్తి సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. సాధారణ క్రాకర్స్ తో పోల్చి చూస్తే పొగ, శబ్దం తక్కువగానే వచ్చినప్పటికీ.. వీటి నుంచి వచ్చే అల్ట్రా ఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలో చేరి ఇబ్బంది పెడతాయని నిపుణులు అంటున్నారు. ఆస్తమా, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. “దీపావళి సమయంలో కాలుష్యం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఉద్గారాలు అధికంగా వెలువడుతుంటాయి. దీనికి క్రాకర్స్ కూడా తోడైతే ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్లే జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఒకటి లేదా రెండు వరకే క్రాకర్స్ వెలిగించి ఆపాలి. దానికంటే దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవడం ఉత్తమం అని” పర్యావరణవేత్తలు అంటున్నారు.