Telugu News » India » How is the exploitation of investors on the country
Exploitation of investors : నేను, నా దేశం.. ఓ పెట్టుబడిదారుడు..
Exploitation of investors: “గురు”అనే మణిరత్నం సినిమాలో అనుకుంటాను ధీరూభాయ్ అంబానీ మీద తీసింది. అందులో అతను చివర్లో అంటాడు- ‘అవును పన్నులు ఎగ్గొట్టాను, మోసం చేశాను.. ఎదిగాను అయితే అదేస్థాయిలో నేను దేశానికి పేరుతెచ్చానుగదా!’ అని. నిజమే అనిపించవచ్చు దాదాపుగా అందరికీ. నిజానికి అది శుద్ద తప్పు. దోపిడీ అనేది మనవాడు చేస్తే ఒప్పయిపోదు. మనవాడు అంటే భూమ్మీద గీసిన రేఖకు ఇవతలి వాడు చేసినంత మాత్రాన ఒప్పయిపోదు. నిజానికి మనకష్టం బాగా తెలిసిన వాడు […]
Written By:
NARESH, Updated On : December 7, 2021 11:18 am
Follow us on
Exploitation of investors: “గురు”అనే మణిరత్నం సినిమాలో అనుకుంటాను ధీరూభాయ్ అంబానీ మీద తీసింది. అందులో అతను చివర్లో అంటాడు- ‘అవును పన్నులు ఎగ్గొట్టాను, మోసం చేశాను.. ఎదిగాను అయితే అదేస్థాయిలో నేను దేశానికి పేరుతెచ్చానుగదా!’ అని. నిజమే అనిపించవచ్చు దాదాపుగా అందరికీ. నిజానికి అది శుద్ద తప్పు.
investers india
దోపిడీ అనేది మనవాడు చేస్తే ఒప్పయిపోదు. మనవాడు అంటే భూమ్మీద గీసిన రేఖకు ఇవతలి వాడు చేసినంత మాత్రాన ఒప్పయిపోదు. నిజానికి మనకష్టం బాగా తెలిసిన వాడు దోపిడీ చేయడమంటే అది మరింత అమానవీయం, దారుణం. పెట్టుబడిదారుడు తనదోపిడీకి తన ప్రాంతీయత, సంస్కృతి, దేశభక్తి, వ్యక్తిగత నిబద్దత లాంటి పదాలను వాడుకుంటాడు. బ్రిటిష్ వాడు వనరుల్ని కొల్లగొట్టి పోవడానికీ, రిలయన్స్, టాటా, బిర్లాల రూపంలో పెట్టుబడుదారులకూ వాస్తవంలో దోపిడీలో పెద్ద తేడావుండదు. ఎందుకంటే సామాన్యుడికి తనను దోచుకునేవాడి పేరుతో సంబంధంలేదు మరి.
గురు సినిమా అంత అందంగా దోపిడీని సమర్థించుకున్న ఒక వ్యక్తిని పరిచయం చేద్దామని రెండు వారాలక్రితపు హిందూ ఆదివారం మేగజైన్ చదివాక ఇంటర్-నెట్ లో వివరాలు చూశాక అనిపించింది. అతడు 1820లో దేశంలో అత్యున్నత సంపన్నుడు. ఇంగ్లండ్ కిరీటం చేత నైట్ హుడ్ పొందిన తొలి భారతీయుడు. ఆర్థిక రాజధాని బొంబాయికి అతను తొలి బార్నెట్ మాత్రమేగాదు దాన్ని వారసత్వంగా పొందాడు, లండన్ పత్రికలు, బ్రిటన్ లోని ఉన్నత కుటుంబాలు అతని సాన్నిహిత్యానికై తహతహలాడాయి. పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించిన గొప్ప దాతగా అతనికి పేరుంది. అతడే జెమ్షెట్జీ జేజేభాయ్. (వెంటనే సుప్రసిద్ద టాటా కంపెనీ స్థాపకుడు జెమ్షెట్జీ టాటా గుర్తొస్తే కాసేపు ఆగండి!). అతడి పేరుమీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.
ఈ జెమ్షెట్జీలు పార్శీలు అంటే ప్రస్తుత ఇరాన్ ప్రాంతం నుండి వలసవచ్చి ఎక్కువభాగం గుజరాత్ నందు స్థిరపడి వ్యాపారవర్గంగా ఎదిగినవారు. జేజేభాయ్ బీదస్థితి నుండి పెరిగాడు, ఖాళీ సీసాలేరుకునేవాడిగా “బాటిల్-వాలా” పేరొందిన వాడు. అయితే అప్పట్లో నాటి బ్రిటిష్, ఫ్రెంచ్ వలస వ్యాపార గొడవల్లో భాగంగా చైనా నుండి వస్తోన్న బ్రన్స్-విక్ అనే ఒక బ్రిటిష్ ఓడను ఫ్రెంచ్ వారు పట్టి బంధించి దక్షిణాఫ్రికాకి కొనిపోయినప్పుడు, తర్వాత విడుదలై తిరుగుప్రయాణంలో దేశానికి పోలేని దుస్థితిలో పరిచయమైన ఒక ఓడ యువ డాక్టర్ తో ఏర్పడిన సంబంధం అతని జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ మలుపు పేరు నల్లమందు.
అది నాడు చైనా తేయాకుని విస్తృతంగా దిగుమతి చేసుకున్నందుకు ప్రతిఫలంగా బ్రిటన్ తన వెండి, బంగారాల్ని వూడ్చిపెట్టే సమయం. అదలాగే కొనసాగనివ్వరాదని చైనీయులకు నల్లమందు అలవాటుచేస్తోన్న దారుణమైనకాలం. గుజరాత్ లోని మాల్వా నుండి దాన్ని బొంబాయి నౌకా కేంద్రం ద్వారా చైనాకు తరళించి సొమ్ముచేసుకునే వ్యాపారంలో ఈ జేజేభాయి యువ డాక్టర్ తో భాగస్వామిగా అడ్డగోలుగా సంపాదించాడు. అంటే అతని సంపదంతా చైనా జాతిని పీల్చి పిప్పిచేసిన నల్లమందు వ్యాపారంలో సంపాదించిన సొమ్మన్నమాట. నాడు గుజరాత్ లోని పార్శీలు ఈ వ్యాపారంలో ఆరితేరిపోయారు. అయితే ఎప్పుడైతే ఈ వ్యాపారం గుత్తాధిపత్యం నుండి అందరికీ అందుబాటులోకొచ్చిందో అప్పుడు ఈ ఘరానా పెద్దమనుషులు వెనక్కి తగ్గి సమాజంలో పెద్దమనుషులుగా, దాతలుగా, రాజనీతిఙ్ఞులుగా చలామణిలోకి వచ్చారు. ఈ క్రమంలో వారు తమ గురించి కొత్త చరిత్రలు రాయించుకున్నారు చాలా జాగ్రత్తగా. తన సొంతపేరు జెమ్షీద్ ని జేజేభాయ్ గా, ఒక గుజరాతీ వ్యాపార వర్గంలో భాగంగా మార్చుకున్నాడు. తాను గుజరాత్ లోగాక బొంబాయిలో పుట్టానని రాయించుకున్నాడు. డబ్బుని ఆసుపత్రులు, స్కూళ్లకు కుమ్మరించాడు. బొంబాయి, నాగపూర్ లకు తమ వ్యాపార స్థావరాలు మార్చేసి, చవగ్గా దొరికిన శ్రామికులతో ఇతరవస్తువుల వ్యాపారంలోకి మారిపోయాడు. బ్రిటిష్ వారికి విస్తృతంగా సహకారం అందజేసి పాలనలో పేరుగాంచాడు.
నాదేశపు కంపెనీ అని రొమ్ము విరుచునేటప్పుడల్లా ఇలాంటివి మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి పెట్టుబడిదారుడికీ నాలుగు చేతులు లేవని, దోపిడీ చేసే పైకొచ్చాడని, ఇలాంటి పెద్ద కంపెనీలు ఎంతటి అమానవీయ, నీతిబాహ్యమైన, దారుణమైన ఉత్పత్తి, వ్యాపారాలు చేసి సమకూరిన ధనం పెట్టుబడిగా పదింతలై మనముందు కనిపిస్తోందని గుర్తించాలి. జెమ్షెట్జీ జెజేభాయ్ అండ్ కంపెనీ లాగే టాటా కంపెనీ నిర్మాత అయిన జెమ్షెట్జీ టాటా గురించి వికీపీడియానీ చూడండి.. అతనూ నల్లమందు వ్యాపారం చేశాడనే చిన్న వాక్యం వుంటుంది. దాన్ని విశ్లేషించి చదువుకోండి.
అందాకా ఎందుకు, ధీరూభాయ్ అంబానీ కుటుంబాన్ని నాటి నాగరిక సమాజం (అఫ్ కోర్స్ ఇప్పటికీ టాటా వంటి కుటుంబాలు కూడా) తక్కువస్థాయిలో చూశాయి. అయితే 1987 క్రికెట్ ప్రపంచకప్ స్పాన్సర్ షిప్ హక్కులు పొందిన ఇండియా, దాని నిర్వహణకు దాతలు ఎవరూ దొరక్కపోతే అప్పుడు 9 కోట్లు సమకూర్చిన రిలయన్స్ అధినేత (ఈ కంపెనీ పేరుమీద రిలయన్స్ ప్రపంచకప్ జరిగింది) అంబానీ అడిగిన ఒక ప్రధాన కోరిక ఏమంటే, సన్నాహక మ్యాచ్ లో భాగంగా ప్రపంచమంతా చూసే మ్యాచ్ లో దేశప్రధాని రాజీవ్ గాంధీ పక్కన కుర్చీలో కూర్చోవాలి. అయిపోయింది. ప్రపంచకప్ ముగిసేసరికి అతడు ఈ దేశంలో గతంతో సంబంధం లేని ఒక బ్రాండ్ అయ్యాడు. ఇప్పుడు ఈ దేశానికే కాదు, ప్రపంచంలోనే అధిక సంపన్నుడు.