KCR BRS- National Politics: కొడుకు కేటీఆర్ పోరునో.. లేక నిజంగానే దేశ రాజకీయాలు దున్నేయాలన్న ఆశనో.. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకేశాడు. తన ఉద్యమపార్టీ ‘టీఆర్ఎస్’ను కాలగర్భంలో కలిపేసి దాన్ని ‘బీఆర్ఎస్’గా మార్చేశారు. దుకాణాన్ని ఢిల్లీకి మార్చేసి అక్కడ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా చేసేశారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో కేసీఆర్ కు దగ్గరైన నేతలందరినీ పిలిచారు. కానీ ఆశించిన స్పందన మాత్రం లేదు. కేసీఆర్ కు జిగ్రీ దోస్త్ అయిన జేడీఎస్ అధినేత కుమారస్వామి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ వేడుకకు హాజరయ్యారు. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలందరూ ముఖం చాటేశారు. దీంతో ఆదిలోనే హంసపాదులా కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ అంత ఈజీ కాదని అర్థమైంది.

-కేసీఆర్ బీఆర్ఎస్ ను వ్యతిరేకించింది ఎవరు?
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ప్రాంతీయ పార్టీల నేతలు ఉంటారు. అవసరార్థం రాజకీయాలు చేస్తుంటారు. మోడీని, బీజేపీని మొన్నటివరకూ తిట్టిపోసి ఆయనపై ఒంటికాలిమీద లేచిన బెంగాల్ సీఎం మమతా ఇటీవల ఢిల్లీలో సమావేశానికి మోడీ పిలవగానే వచ్చి టీకాఫీలు తాగి ఆయనతో కుశల ప్రశ్నలు వేసింది. దీదీ బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి వస్తే వేరే లెవల్ లో ఉండేది. కానీ ఈమె కేసీఆర్ తీరు నచ్చక.. ఆయన పాలిటిక్స్ కు వెరిసి ఇటువైపు చూడలేదు. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకొన్న బీహార్ సీఎం నితీష్ కూడా కేసీఆర్ తో కలిసి రాలేదు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ కూడా ఈసారి కేసీఆర్ పిలుపునకు స్పందించలేదు. ఇక జార్ఖండ్ సీఎం సోరేన్ సైతం కేసీఆర్ పార్టీ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్ లతో కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. వారు కూడా ఇటువైపు తిరిగి చూడలేదు. కమ్యూనిస్టు నేతలదీ అదే పరిస్థితి. మహారాష్ట్ర సీఎంగా ఉండగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ కు మంచి సంబంధాలుండేవి. ఇప్పుడు ఆయన పోస్ట్ పోవడంతో ఈ పాలిటిక్స్ కు దూరంగా కేసీఆర్ పార్టీ వేడుకకు ఉద్దవ్ హాజరు కాలేదు. ఇలా జాతీయ స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ కూడా కేసీఆర్ వెంట నడవలేదు. వారంతా కేసీఆర్ జాతీయ పార్టీని వ్యతిరేకిస్తున్నట్టే లెక్క.
-కేసీఆర్ ‘బీఆర్ఎస్’ వెంట నడిచిందెవరు?
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఆయన వెంట నడిచింది కేవలం ఇద్దరు ప్రాంతీయ పార్టీల బలమైన నేతలు మాత్రమే. వారిలో ఒకరు ఆదినుంచి అండగా ఉంటున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి కాగా.. రెండో వ్యక్తి యూపీ రాజకీయాల్లో కీలక శక్తి, సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్. ఈ ఇద్దరు పెద్ద నేతలు మాత్రమే బీఆర్ఎస్ వెంట నడిచారు.. కేసీఆర్ కు సపోర్టుగా నిలిచారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతు నేతలు కేసీఆర్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
-పాల్గొన్న కవిత, హరీష్, మంత్రులు.. కేటీఆర్ మాత్రం రాలేదు
కేసీఆర్ ‘బీఆర్ఎస్’ కార్యక్రమం అంటే అది ఆ పార్టీకి పండుగలాంటిది. ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన పార్టీని జాతీయస్థాయికి తీసుకెళ్లగలిగే బృహత్తర కార్యక్రమం. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాంలో కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు మంత్రి అయిన హరీష్ రావులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలందరూ హాజరయ్యారు. తెలంగాణ నుంచి వందలమంది టీఆర్ఎస్ నేతలు ఈ పార్టీ వేడుకకు హాజరయ్యేందుకు తరలివెళ్లారు. కానీ సొంత కొడుకు, మంత్రి కేటీఆర్ మాత్రం ఈ వేడుకకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో ముందే ఒప్పుకున్న ప్రోగ్రాంలు ఉన్నాయని కేటీఆర్ అన్నా కూడా అది సరైన కారణం కాదని.. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లకపోవడానికి బలమైన కారణమే ఉంటుందని తెలుస్తోంది. కేసీఆర్ లేని వేళ హైదరాబాద్ లో ఉండాల్సిన ఆవశ్యకతనా? లేక ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫెక్ట్ తోనే కేటీఆర్ వెళ్లలేదా? అన్న ప్రచారం కూడా సాగుతోంది.
-కేటీఆర్ రాకపోవడానికి అసలు కారణం అదేనా?
నిజానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ యే. టీఆర్ఎస్ కు అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. అయినప్పటికీ పార్టీ పేరు మారి జాతీయస్థాయిలో విస్తరిస్తున్న వేళ కేటీఆర్ దూరంగా ఉండడం సంచలనమైంది. హైదరాబాద్లో ఎంత ముఖ్యమైన పని ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకంటే ఏవీ ముఖ్యం కాదు. పైగా వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ విషయంపై ఏదో అంతర్గత చర్చ నడుస్తోందని.. కేటీఆర్ ను తెలంగాణకు పరిమితం చేసి.. కవితను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనుకుంటున్నారని.. అందుకే బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి కేటీఆర్ దూరం జరిగారనే ప్రచారం సాగుతోంది. గతంలోనే పార్టీ, ప్రభుత్వం పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విబేధాలొచ్చాయని.. విస్తృతంగా ప్రచారం జరిగింది. కొంతకాలం పాటు టీఆర్ఎస్ అధికారిక పత్రికలో కవిత పేరు కూడా కనిపించలేదు. తర్వాత అంత సర్దుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పెద్దగా ఘటనలకు బయటకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ కూతురు కవితకు పెద్దపీట వేయడం.. జాతీయ రాజకీయాలు ఆమెకే ఇచ్చి కేటీఆర్ ను రాష్ట్రానికి పరిమితం చేయడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేదని.. తనే కేసీఆర్ తర్వాత జాతీయస్థాయిలో ఉండాలని కేటీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే ఈ కీలక సమావేశానికి కేటీఆర్ హాజరుకాకుండా గుర్రుగా ఉన్నాడని అంటున్నారు.

ఎంతో ఘనంగా నిర్వహిద్దామని ప్లాన్ చేసినా కూడా పెద్దగా నేతల తాకిడీ లేకపోవడంతో ఈ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం కలతప్పింది. వెలవెలబోయింది. ఇటీవల బీహార్ వెళ్లి మరీ ఆ రాష్ట్ర సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్విని కేసీఆర్ కలిశారు. వాళ్లు కూడా ఈ వేడుకకు రాకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ కు ఎంతో దగ్గరైన మమత, నితీష్, ఉద్దవ్, స్టాలిన్, సీపీఐనేతలు కూడా కలిసి రాకపోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళతారన్నది ఆసక్తి రేపుతోంది. మరి తొలి బీఆర్ఎస్ కలయినే ఇలా షాకిస్తే కేసీఆర్ మున్ముందు ఎలా ముందుకెళతాడన్నది వేచిచూడాలి.