
ACB Rides : ఆమె పేరు శ్రీలత. చేసే ఉద్యోగం మధిర పట్టణంలోని బాలిక పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలిగా.. నెలకు వేతనం రూ. 90 వేల పై మాటే. అలవెన్స్‌లు కూడా గట్టిగానే వస్తాయి. కుటుంబం కూడా బాగానే స్థిరపడింది. పైగా రోజూ ఈ మేడం కారులో వస్తుంది. స్థానికంగా ఉండాల్సింది పోయి ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తుంది. అలాంటి ఈ ప్రధానోపాధ్యాయురాలికి పైసల మీద యావ చావలేదు. నెలకు రూ.90 వేల జీతం వస్తున్నా ఇంకా సంపాదించాలి అనుకుంది. అందుకోసం అడ్డదారులు తొక్కింది. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడింది. పిల్లలకు పాఠాలు చెప్పి, మంచి నడవడిక నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చివరకు తల దించుకోవాల్సి వచ్చింది. అది కూడా తాను పని చేస్తున్న పాఠశాలలో..
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని గర్స్ హైస్కూల్‌కు మన ఊరు మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వం రూ. 24 లక్షలు మంజూరు చేసింది. వీటిని గత ఏడాది మే నెలలో విడుదల చేసింది. ఈ పనులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ ఎస్కే ఫాతిమా చేయాల్సి ఉంది. అయితే ఆమె ఈ పనులను స్థానిక కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లుకు అప్పగించింది. అయితే అతడు 90 శాతం పనులు పూర్తి చేశారు. ఈ పనులను కూడా నాలుగు నెలల క్రితమే పూర్తి చేశారు. ఇటీవల పనులకు సంబంధించిన బిల్లు రూ7,88,446 బిల్లును ప్రభుత్వం పంపించింది. దానిని ఇచ్చేందుకు 20 రోజులుగా తిప్పుతూ రూ. 50 వేలు ఇస్తేనే బిల్లు ఇస్తానని ఇన్‌చార్జ్ హెచ్‌ఎం తేల్చిచెప్పేసింది. దీనికి ఒప్పుకున్న ఆయన చెక్కు ఇచ్చిన వెంటనే డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పగా దీనికి ఆమె సమ్మతం తెలిపింది.

-రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
డబ్బులు డ్రా చేసిన కాంట్రాక్టర్ ముగుగోటి వెంకటేశ్వర్లు తన కుమారుడు రాము ద్వారా రూ.25వేలు పంపించాడు. అతను హెచ్‌ఎం శ్రీలతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అరుతే ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వేధింపులపై వెంకటేశ్వర్లు ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వేసిన ప్లాన్ ప్రకారం రసాయనం పూసిన కరెన్సీ నోట్లను వెంకట్వేర్లు కుమారుడి ద్వారా ఆమెకు అందేలా చేశారు. అప్పటికే మఫ్టీలో ఉన్న అధికారులు పాఠశాల ఆరు బయట ఉన్నారు. ఎప్పుడయితే వెంకటేశ్వర్లు కుమారుడు నగదును శ్రీలతకు ఇచ్చాడో అప్పుడే ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఆమె వేలి ముద్రలు సేకరించారు. ‘హెచ్‌ఎం శ్రీలత కాంట్రాక్టర్ చేసిన పనులకు 2శాతం కమీషన్ గా 50వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ బిల్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. అతను విసిగి పోయి మమ్మల్ని ఆశ్రయించాడు. మా సూచన మేరకు కాంట్రాక్టర్ తన కుమారుడు ద్వారా డబ్బు పంపించాడు. హెచ్‌ఎం శ్రీలత డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఖమ్మంలోని ఆమె నివాసంలో కూడా మేం సోదాలు చేస్తున్నాం. దీనిపై కేసు నమోదు చేసి ఆమెను హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు’ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు.