CM KCR: తెలంగాణలో మాటతో మాయ చేసే లీడర్లలో ముందు వరుసలో ఉంటారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గళమే కేసీఆర్ బలం. ఆయన మాట్లాడితే వినాలనుకునే వారు లక్షల మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాలను తన మాటలతోనే ఏకటాటిపైకి తీసుకు వచ్చారు గులాబీ బాస్. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన మాటలతోనే ఓటర్లను మెస్మరైజ్ చేయగలిగారు. విపక్షాలను చీల్చి చెండాడి.. ఒక్క రోజులోనే ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో కేసీఆర్ దిట్ట. ఆ ధీమాతోనే ఈసారి ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మొదట కేసీఆర్ తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని ఆహ్వానించారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తున్నారు అని బాధపడుతున్నారు. దీనికి కారణం ఆయన మాటలో పదును తగ్గడమే. ప్రజలను మెస్మరైజ్ చేసే స్పీచ్ ఇప్పటి వరకు ఒక్క సభలో కూడా కనిపించలేదు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు సైతం ఎందుకిలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ స్పీచ్ కోసం గంటల తరబడి వేచిచూసే ప్రజలు కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడం కనిపిస్తోంది.
పిట్ట కథలు.. పంచ్ డైలాగ్‌లు లేకుండానే..
కేసీఆర్ తెలంగాణలో ఇప్పటికే తొలి విడత ఏడు సభలు, మలి విడత ఆరు సభలు నిర్వహించారు. కానీ తొలి విడత సభల్లోనే ఆయన స్పీచ్ చప్పగా సాగింది. దీంతో రెండో విడత అయినా జోరు పెంచుతారు, ఓటర్లను ఆకట్టుకుంటారని నేతలు భావించారు. కానీ సభల సంఖ్య పెరిగింది తప్ప స్పీచ్‌లో వాడి పెరగలేదు. గతంలో ఎక్కడ సభ పెట్టిన కేసీఆర్ పిట్ట కథలు, పంచ్ డైలాగ్సతో సభికుల్లో జోష్ తెచ్చేవారు. మధ్య మధ్యతో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు అవేవీ కానరావడం లేదు.
చెప్పేదేమీ లేదంటూ..
ఇప్పటి వరకు నిర్వహించిన 13 సభల్లో కేసీఆర్ తాను కొత్తగా చెప్పేదేమీ లేదు అంటూ ప్రసంగం మొదలు పెడుతున్నారు. మొదటి మాటే ప్రజలను నిరుత్సాహ పరుస్తోంది. కొత్తగా ఏదైనా చెబుతారని సభలకు వస్తున్న జనానికి కొత్తగా చెప్పేదేమీ లేదు.. అంతా మీకు తెలుసు అనడంతోనే నిరాశ చెందుతున్నా. వాస్తవానికి జనానికి తెలిసింది చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, బీఆర్‌ఎస్ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, కమీషన్లే. వీటి గురించి అయినా కేసీఆర్ మాట్లాడతారని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఇసారి జరుగకుండా చూస్తానని చెప్పడం లేదు. పథకాలన్నీ అధికార పార్టీ నేతలకే అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మాట్లాడడం లేదు. గతంలో తాను కుర్చీ వేసుకుని కూర్చుండి పని చేయిస్తా అని చెప్పేవారు.. కానీ ఆ మాట ఎక్కడా నిలబెట్టుకోలేదు. దీంతో ఇసారి ఆమాట ఎత్తడం లేదు. ఉద్యోగాల భర్తీ, రైతుల రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు. దీంతో చప్పగా సాగుతున్న కేసీఆర్ సభలను చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
డిఫెన్స్, బెదిరింపులు..
ఇక కేసీఆర్ ఈసారి కొత్తగా డిఫెన్స్ వ్యాఖ్యలు, బెదిరింపు మాటలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సభల్లో ఓడిపోతే మాకు పోయేదేం లేదు.. ఇంట్లో కూర్చుంటం అని చెబుతున్నారు. మరోవైపు తమను ఓడిస్తే నష్టపోయేది ప్రజలే అని బెదిరిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అయితే బీఆర్‌ఎస్ ఓడిపోతే హైదరాబాద్ అమరావతి అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమైన మంత్రి కేటీఆర్.. తెలంగాణను రాబంధుల చేతిలో పెట్టొద్దని అంటున్నారు.
మొత్తంగా వాడి, పదును లేని కేసీఆర్ స్పీచ్ ఈసారి బీఆర్‌ఎస్‌కు పెద్ద మైనస్ అని సొంత పార్టీ నేతలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పటికైనా కేసీఆర్ జోరు పెంచాలని కోరుతున్నారు.