
‘అదేంటీ.. లాక్ డౌన్ పెడితే వణికిపోవాల్సింది ప్రజలు కదా’ అనుకుంటున్నారా? ప్రజల వంతు ఎలాగో ఉంటుంది. కానీ.. గత లాక్ డౌన్ ద్వారా తలెత్తిన ఇబ్బందులు, ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వాలు.. మరోసారి ఆ నిర్ణయం తీసుకునేందుకు జంకుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
గతంలో ఈ స్థాయి కేసులు నమోదైనప్పుడే లాక్ డౌన్ విధించింది కేంద్రం. దానివల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో అందరికీ తెలిసిందే. అందరూ అనుభవించిందే. చేయడానికి పనిలేక, కనీసం తినడానికి తిండిలేక ఎంతో మంది అల్లాడిపోయారు. ఆకలి చావులు కూడా సంభవించానే వార్తలు వచ్చాయి. ఇది సామాన్య జనం పరిస్థితి.
ఇక, ప్రభుత్వాలు ఎదుర్కొన్న సవాళ్లు, నష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా తలెత్తిన నష్టాలను ఇప్పటికీ పూడ్చుకోలేకపోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పాఠాల నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించడానికి ప్రభుత్వాలు ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని విద్యాసంస్థలు మూసేసింది తెలంగాణ. దీంతో.. లాక్ డౌన్ మళ్లీ విధిస్తారా? అనే టెన్షన్ మొదలైంది. కానీ.. అలాంటిది ఏమీ ఉండదని అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి. అటు ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్ డౌన్ గురించిన మాటే మాట్లాడట్లేదు సీఎం జగన్. పాఠశాలలకు మాత్రం ఒంటిపూట బడులు పెట్టాలని ఆదేశించారు.
మరోవైపు కేంద్రం కూడా లాక్ డౌన్ గురించి మాట్లాడట్లేదు. గత లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలాప్రభావం చూపిందో కేంద్రానికి అర్థమైంది. ఆ లోటు ఇప్పటికీ వివిధ రంగాల్లో కనిపిస్తూనే ఉంది. అందుకే.. మరోసారి లాక్ డౌన్ యోచన చేయట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి.. లాక్ డౌన్ అంటే ప్రజలకన్నా, ప్రభుత్వాలే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది.