
వైసీపీ నేతలకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆయన మరోసారి మండిపడ్డారు. గుంటూరులో సోమవారం జరిగిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ తో ఏకాత్మతా మానవతావాదం తో, అంత్యోదయ సిద్ధాంతాలతో 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.కరోనా కష్టకాలంలో కేంద్రం చేస్తున్న సాయాన్ని జగన్ ప్రభుత్వం తమదిగా చెప్పుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆక్షేపించారు. కరోనా విషయంలోనూ వాస్తవాలు దాచిపెడుతున్నారని, ప్రభుత్వం వెలువరిస్తున్న నివేదికల్లో వాస్తవం లేదని ధ్వజమెత్తారు. ఈ కష్ట సమయంలో పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడాలని, ఒక పూట ఉపవాసం ఉండి, ఆహారాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.