Ganta Srinivasa Rao- Anam Ramanarayana Reddy: కొన్ని మాటలు చెప్పడానికే పనికొస్తాయి తప్ప ఆచరించలేం. అచరణ సాధ్యం కూడా కాదు. అందునా రాజకీయాల్లో ఉన్నవారు మాట మీద నిలబడలేరు. రాజకీయం అనేది చదరంగం కాబట్టి. అక్కడ గెలుపునకే ప్రాధన్యం కాబట్టి ఇట్టే మాటలు మారిపోతుంటాయి. అక్కడ ప్రయోజనాల ముందు ఇతర అంశాలు చిన్నబోతాయి. చంద్రబాబు విషయానికే వద్దాం. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఎన్నో చెప్పారు. అధికార పార్టీకి భయపడిన ఇంటికే పరిమితమైన నేతల్లో ధైర్యాన్ని నింపారు. పోరాటంలోకి దించాలని భావించారు. కానీ చాలామంది సైలెంట్ నే ఆశ్రయించారు. అటువంటి వారికి కొవిడ్ పనికొచ్చింది. ఆ కారణం చెప్పి రాజకీయాలు విడిచిపెట్టేశారు. వ్యాపారాలు చేసుకున్నారు. అప్పట్లోనే చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచిన వారికే టిక్కెట్లు అని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారుతోంది. గత ఆరు నెలలుగా యాక్టివ్ గా పనిచేసే నేతలతో పార్టీ కిటకిటలాడేసరికి.. ఇప్పుడు ఆయనకు గెలుపు గుర్రాలు గుర్తించారు. కష్టకాలంలో వెన్నంటి ఉండే వారు కాస్తా దూరమయ్యారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావునే తీసుకుందాం. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పార్టీకి దూరమయ్యారు. తొలిరోజుల్లో శాసనసభకు హాజరైనా అంటీముట్టనట్టుగా అక్కడెక్కడో చివరి సీటులో కూర్చునే వారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా పదవికి రాజీనామా చేసిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టడమే మానేశారు. సొంత పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా దీక్ష చేసినా అటువైపు కన్నెత్తి చూడలేదు. అంతెందుకు విశాఖలో పర్యటించిన చంద్రబాబు, లోకేష్ లను పలకరించేందుకు కూడా ఆసక్తి చూపలేదు. గెలిపించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జిని నియమించి నాలుగేళ్లు మమ అనిపించేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో తిరిగి యాక్టివ్ అవుతున్నారు. అర్ధబలం, కులబలం ఉండడంతో గంటాను చంద్రబాబు, లోకేష్ లు అక్కున చేర్చుకున్నారు. గంటా రాజకీయ ప్రత్యర్థి అయ్యన్న రుసరుసలాడినా, వాడేమైనా ప్రధాని అని విమర్శించినా ఇప్పుడు చంద్రబాబుకు పట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు గెలుపు గుర్రం అవసరం. ఎక్కడ సీటిచ్చినా గెలిచే చాన్స్ ఉండడంతో కష్టపడే నేతలు అన్న మాట ను పక్కన పెట్టేసి.. గెలుపు అనే సరికొత్తవాదాన్ని తలకెక్కించుకొని గంటాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి చాప్టర్ అధికార పార్టీలో క్లోజ్ అయినట్టే. ఆయనకు పొమ్మనలేక పొగ పెడుతున్నారు. వేరే పార్టీ చూసుకోవాల్సిందే. అర్ధబలం, అంగబలం ఉన్న ఆనం వస్తానంటే చంద్రబాబు కూడా వద్దనరు. ఎందుకంటే ఆనంలాంటి వారు వస్తే ఓట్లు, సీట్లు పెరుగుతాయి. వీక్ గా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ బలం పెరుగుతుంది. అంతవరకూ ఒకే కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసేవారి పరిస్థితి ఇప్పుడు ఏంటి? అధికారంలోకి వస్తే నామినేట్ పదవి ఇస్తామని చెప్పడం తప్పించి మరో ఆప్షన్ లేదు. అంతదానికి కష్టపడే ప్రతీ నాయకుడికి చాన్స్ ఉంటుంది. ముఖం చాటేసేవారికి సీట్లు ఉండవు అన్న ప్రకటనలెందుకు? ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆ పాత ప్రకటనలు, మాటలు పక్కకు వెళ్లిపోవడం ఖాయం. అందుకు గంటా, ఆనంల ఎపిసోడ్లే ఉదాహరణ.